
కొత్తగూడెంలో 600 ఎకరాల అటవీ భూమిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుమారు 600 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ భూమిపై అటవీ శాఖకే పూర్తి హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ, దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి తెరదించింది.
ఈ కేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కల్వల నాగారం గ్రామం, కరకగూడెం మండలంలోని సర్వే నంబర్ 81లో ఉన్న భూమికి సంబంధించినది. ప్రభుత్వం 1950 ఫిబ్రవరి 6న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో చేర్చే ప్రక్రియ ప్రారంభించింది. పిటిషనర్లు మాత్రం ఈ భూమి తమకు నిజాం పాలన కాలంలో 1931–33 ఫసలీ సంవత్సరాల్లో మంజూరైందని వాదించారు. అందువల్ల దీనిని అటవీ పరిమితుల నుంచి మినహాయించాలని కోరారు. అయితే తమ యాజమాన్య హక్కులను నిరూపించే చెల్లుబాటు అయ్యే పత్రాలను వారు సమర్పించలేకపోయారు.
ఈ నేపథ్యంలో అప్పటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ కార్యాలయం 2003 మే 19న ఇచ్చిన ఉత్తర్వులో పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించింది. అధికారిక రికార్డుల్లో ఈ భూమి “ఫారెస్ట్”గా నమోదైందని, అందువల్ల యాజమాన్య హక్కుల వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్లు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. మొదట సింగిల్ జడ్జి పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే అనంతరం డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేసి ప్రభుత్వ వైఖరినే సమర్థించింది.
రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులు కావు
ఆ తర్వాత పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో సుప్రీంకోర్టు ఫైసల్ పట్టి, వసూల్ బాకీ, పహాణీ వంటి రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులను నిర్ధారించవని స్పష్టం చేసింది. అవి అత్యధికంగా భూమిపై స్వాధీనం లేదా వినియోగాన్ని మాత్రమే సూచిస్తాయని పేర్కొంది. ఈ భూమి చాలా కాలంగా అటవీ భూమిగానే అధికారిక రికార్డుల్లో నమోదై ఉందని కోర్టు గుర్తుచేసింది.
అదేవిధంగా, రిట్ పిటిషన్ ద్వారా టైటిల్ డిక్లరేషన్ ఇవ్వడం సాధ్యం కాదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ముందుగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం, డివిజన్ బెంచ్ తీర్పుతో పాటు జాయింట్ కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ 600 ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలోనే కొనసాగనుంది.
