Let's talk: editor@tmv.in
పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

Panthagani Anusha
2 మే, 2026

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే తక్షణమే ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.

కాగా గతంలో గువాహటి హైకోర్టు ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ఈ కేసులోని కీలక సాక్ష్యాధారాలను వాస్తవాలను సరిగ్గా విశ్లేషించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 339ని ఈ కేసులో ప్రయోగించడం సబబు కాదని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడిపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు ప్రాథమికంగా లేవని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కేసు నేపథ్యం, ఆరోపణలు

అస్సాం ముఖ్యమంత్రి భార్యకు విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయని ఆమె విదేశాల్లో ప్రకటించని ఆస్తులను కలిగి ఉన్నారని పవన్ ఖేరా గతంలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆమె ఫిర్యాదు చేయడంతో గువాహటి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో మొదట తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చినప్పటికీ అస్సాం ప్రభుత్వం దానిని సవాలు చేయడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ అనంతరం ఇప్పుడు ఖేరాకు ఊరట లభించింది.

షరతులతో కూడిన బెయిల్

అయితే బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అత్యున్నత న్యాయస్థానం పవన్ ఖేరాకు పలు షరతులు విధించింది. దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా న్యాయస్థానం ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది.