Let's talk: editor@tmv.in
తళంబూర్ భూవివాదానికి సుప్రీం ముగింపు

తళంబూర్ భూవివాదానికి సుప్రీం ముగింపు

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

తమిళనాడులోని తళంబూర్ గ్రామంలో భూ లావాదేవీలపై సాగుతున్న దీర్ఘకాల న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఏళ్లుగా అమల్లో ఉన్న స్టేటస్-కో ఆదేశాన్ని ఎత్తివేస్తూ, వేలాది మంది అమాయుకులైన యజమానులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కీలక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌కుమార్‌‌, వినోద్‌చంద్రన్‌ల బెంచ్ స్వయంగా సంక్షేమ రాష్ట్రం అని చెప్పుకునే ప్రభుత్వం, దశాబ్దాల కిందటి లావాదేవీలను తిరస్కరించేందుకు ప్రయత్నించడం సరికాదు. అప్పటికే మూడో పక్షం హక్కులు ఏర్పడ్డాయి. కష్టార్జిత డబ్బుతో ఇళ్లు కట్టుకున్న పౌరుల ప్రయోజనాలను విస్మరించలేరని వ్యాఖ్యానించింది.

కేసు నేపథ్యం

ఈ కేసు కాంచీపురం జిల్లాలోని తళంబూర్ గ్రామానికి సంబంధించినది. 2018లో దాఖలైన పిల్ ద్వారా, స్వాతంత్ర్య సమరయోధులు, వ్యక్తులకు కేటాయించిన భూములను అక్రమంగా ప్రైవేట్ డెవలపర్లకు విక్రయించారన్న ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో కాసాగ్రాండ్‌ బిల్డర్‌‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి డెవలపర్లు పెద్ద ఎత్తున నివాస ప్రాజెక్టులు చేపట్టారు. మొదట మద్రాస్‌ హైకోర్టు రాష్ట్రానికి ‘డిస్క్రీట్ ఇన్క్వైరీ’కి అనుమతి ఇచ్చింది. అయితే 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టేటస్-కో ఆదేశం తెచ్చుకుంది.

స్టేటస్-కో వల్ల ఇబ్బందులు

దర్యాప్తు పేరుతో వచ్చిన ఈ ఆదేశం, ఇంటి యజమానులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. వందలాది ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. తాగునీరు, మురుగునీటి వంటి మౌలిక వసతులు కూడా నిలిచిపోయాయి. 2020–21 మధ్య మూడు నివేదికలు వచ్చినా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రం న్యాయ ప్రక్రియను కాలయాపనకు ఉపయోగించుకుంటోందని బెంచ్ వ్యాఖ్యానించింది.

సైనికుల ఇళ్లకు ఊరట

ఈ కేసులో ఆర్మీ వెల్ఫేర్‌‌ హౌసింగ్‌ ఆర్గనైజేషన్‌ నిర్మించిన 852 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా స్టేటస్-కో కారణంగా నిలిచిపోయాయి. వీరికి ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. రిటైర్డ్ జడ్జి కె.పీ. శివసుబ్రహ్మణ్యం కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత రెండు నెలల్లో రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకోవాలి. ఒక సర్వే నంబరులో ఉన్న 450 ఫ్లాట్లకు వెంటనే నీరు, మురుగునీటి కనెక్షన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రక్రియ ఆలస్యం పేరుతో పౌరులకు మౌలిక సదుపాయాలు నిరాకరించలేరని స్పష్టం చేసింది.