
నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వండి.. ఎంపీలకు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు లేఖలు రాశారు. ‘నారీ శక్తి వందన్’ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.
మంగళవారం పంపిన ఈ లేఖల్లో 2029 ఎన్నికల నుంచి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకువస్తున్న బిల్లుకు ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుస్తూ ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో పరిపాలనలో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది” అని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్‌లో ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశంలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. దీని ద్వారా మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది.
