
మొక్కజొన్న రైతులను ఆదుకోండి.. కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్నను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఆయన సోమవారం ఒక లేఖ రాశారు. మార్కెట్‌లో ధరల పతనం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని ఆదుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతుండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) క్వింటాల్‌కు రూ. 2,400 ఉండగా మార్కెట్‌లో మాత్రం కేవలం రూ.1,600 నుంచి రూ. 1,700 మధ్య మాత్రమే పలుకుతోందని లేఖలో వివరించారు. అంటే ప్రతి క్వింటాల్‌పై రైతు దాదాపు రూ. 700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
ఇక రాష్ట్రవ్యాప్త దిగుబడి గణాంకాలను కేంద్రానికి వివరిస్తూ ఈ రబీ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఇందులో ఇప్పటికే కొంత పంట చేతికి రాగా మరో 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఇంకా కోత దశలో ఉందని పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోకపోతే దళారుల చేతిలో రైతులు తీవ్రంగా మోసపోయే ప్రమాదం ఉందని తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి తగిన మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో పీఎం-ఆశా పథకం కింద రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి ఈ ధరల వ్యత్యాసాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. అదేవిధంగా ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించడంతో పాటు నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టేందుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు తన లేఖలో ఆకాంక్షించారు.
