
అండమాన్ పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు: మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపుకు మద్దతుగా, అండమాన్ & నికోబార్ దీవుల పరిరక్షణ కోసం తాము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి అభివృద్ధి ఖచ్చితంగా అవసరమేనని, కానీ అది పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడే దిశగా సాగాలని స్పష్టం చేశారు.
ప్రకృతి పరంగా, భౌగోళికంగా ఎంతో విశిష్టమైన పేరుగాంచిన నికోబార్ ఐలాండ్‌ను కార్పొరేట్ సంస్థ అయిన అదానీకి అప్పగించే ప్రక్రియ సాగుతోందని మంత్రి ఆరోపించారు. పారిశ్రామిక అభివృద్ధి అనే ముసుగులో ఆ దీవిని నాశనం చేస్తున్న పరిస్థితులను రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ ఉన్న దేశ రక్షణకు సంబంధించిన నావికాదళ స్థావరం విస్తరణకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా, పర్యావరణానికి మేలు చేసే వేలాది మొక్కలను, వృక్షాలను అడ్డగోలుగా కొట్టేస్తూ ప్రకృతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ సాగే ఎలాంటి అభివృద్ధికైనా తమకు అభ్యంతరం లేదని.. కానీ, కేవలం అదానీని సంతృప్తి పరచడానికే ఒక పూర్తి ఐలాండ్‌ను కట్టబెట్టి, దాన్ని పాడుచేసే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరైంది కాదన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాహుల్ గాంధీ స్ఫూర్తికి, ఆయన చేస్తున్న పర్యావరణ పోరాటానికి ప్రజలందరూ సామాజికంగా అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
