Let's talk: editor@tmv.in
కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

Gaddamidi Naveen
24 జూన్, 2026

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అల్పాదాయ వర్గాల కోసం క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక 'లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి' పేరు ఖరారు చేసేందుకు హౌసింగ్ బోర్డు ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ప్రజల నుంచే నేరుగా పేర్లను స్వీకరించాలని నిర్ణయించింది. ప్రజలు సూచించిన పేర్లలో ఉత్తమమైన దానికి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈ లక్ష ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. సుదీర్ఘ కాలం తర్వాత చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా ఈ బహిరంగ పోటీని నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఈ నెల 28 వరకూ సోషల్ మీడియా వేదికగా పోటీ నిర్వహించనున్నారు. tghd.official ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నారు. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎల్‌ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు అవసరమైన భూములను అధికారులు ఇప్పటికే గుర్తించారు.

అర్హులైన ప్రజల నుంచి త్వరలోనే దరఖాస్తులను స్వీకరించి, పూర్తిగా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను హౌసింగ్ బోర్డు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అందుబాటు ధరల్లో సొంత ఇల్లు అందించే ఈ మహత్తర పథకానికి మంచి పేరును సూచించి, లక్ష రూపాయల బహుమతి పొందే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆసక్తి ఉన్న వారు లక్ష ఇళ్ల పథకానికి మంచి పేరు సూచించి రూ. 1 లక్ష నగదు బహుమతిని సొంతం చేసుకోండి.