
రాష్ట్ర వినియోగానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది : మంత్రి రవికుమార్
రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, పెరిగిన విద్యుత్ వినియోగం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, కేవలం సాంకేతిక కారణాల వల్లే అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయని స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడిన మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. అధిక లోడ్ కారణంగా ట్రాన్స్‌మిషన్ లైన్లు దెబ్బతినడం ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈదురు గాలులు, వర్షాల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం కండక్టర్లు తెగిపోవడం వల్ల కూడా పలుచోట్ల సరఫరా అంతరాయం కలుగుతోందన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం శాఖ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు. మరమ్మతుల సమయంలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు.
అయితే వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మంత్రి సూచించారు. మూడు డిస్కంల పరిధిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని సమస్యల త్వరిత పరిష్కారం కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించామని వెల్లడించారు.
ఇదిలాఉండగా సత్తెనపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలను ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్క సబ్‌స్టేషన్ కూడా నిర్మించలేదని మంత్రి విమర్శించారు. దీంతో విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రూ.6 వేల కోట్ల వ్యయంతో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సుమారు 30 సబ్‌స్టేషన్లు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని చెప్పారు. జిల్లాల అవసరాలను బట్టి ట్రాన్స్‌ఫార్మర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఈ పనులు పూర్తయితే విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు.
ఏలూరు, విజయవాడ ఎయిర్‌పోర్టు వంటి కీలక ప్రాంతాల్లో ముందస్తుగా సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని అదేవిదంగా అనుమతులు లేని హోర్డింగులు, ఫ్లెక్సీలు విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గాలులు, వర్షాల సమయంలో అవి విద్యుత్ తీగలపై పడటంతో లైన్లు తెగిపోతున్నాయని తెలిపారు. ఇటీవల విజయవాడలో హోర్డింగులు విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా పునరుద్ధరణకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందన్నారు. శ్రీకాకుళం, నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో కూడా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.
ఈ సమస్యపై మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లి, అనుమతులు లేని హోర్డింగులు, ఫ్లెక్సీల తొలగింపుకు చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. ఒకవైపు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, మరోవైపు ఆర్డీఎస్ఎస్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
