Let's talk: editor@tmv.in
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
10 జూన్, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన ప్రమాద ఘటనా స్థలని సందర్శించి, పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలోని ఒకరికి ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయ‌న తెలిపారు.అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శాశ్వత (రెగ్యులర్) ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 45.75 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు దీర్ఘకాలిక భరోసా కల్పించే చర్యలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన ఉద్యోగుల పిల్లల విద్య ప్రస్తుతం ప్లాంట్ ఉద్యోగుల పిల్లలకు అందుతున్న విధంగానే కొనసాగుతుందని తెలిపారు. అలాగే, మృతి చెందిన ఉద్యోగి పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో నివసించవచ్చని చెప్పారు. టౌన్‌షిప్ వెలుపల అద్దె ఇళ్లలో ఉంటున్న బాధిత కుటుంబాలు కోరుకుంటే వారికి కూడా క్వార్టర్స్ కేటాయిస్తామని వెల్లడించారు.

30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ‘ల్యాడిల్ బ్లాస్ట్

గత 36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ద్రవ ఉక్కును మోసుకెళ్లే ‘ల్యాడిల్ బకెట్’ ఈ స్థాయిలో పేలిపోయి, ఇంత మందిని బలిగొన్న సంఘటన ఎన్నడూ జరగలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. చైనా, ఫ్రాన్స్ వంటి విదేశీ కర్మాగారాల్లోనూ ఇలాంటి అరుదైన పేలుడు నమోదు కాలేదన్నారు. ఈ ఘటనపై బొకారో స్టీల్ ప్లాంట్ కు చెందిన నిపుణుల త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు. ల్యాడిల్ బకెట్ యొక్క స్లైడ్ గేట్ తెరవకముందే అసలు పేలుడు ఎందుకు సంభవించింది? ఇది సాంకేతిక లోపమా లేక మరేదైనా సమస్యనా? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో కార్మికులు తనతో మాట్లాడూతూ.. యాజమాన్యం పాత పరికరాలను మార్చకుండా నిర్లక్ష్యం వహించిందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం

స్టీల్ ప్లాంట్ లోని లోపాలు, సేఫ్టీ ప్రోటోకాల్స్ వైఫల్యాలపై క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులతో స్వయంగా ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాదు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన్నదే మా ప్రభుత్వ గట్టి ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ఆశిస్తున్నామ‌ని ఆయన నొక్కిచెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటీకరించాలని చూస్తే తాము రోడ్లపైకి వచ్చి కొట్లాడామని గుర్తుచేశారు. ఈ ప్లాంట్ కోసం ఆంధ్రులతో పాటు తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా ప్రాణాలర్పించారని, దీనికి ప్రాంతాలకు అతీతమైన చరిత్ర ఉందన్నారు. కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా పనిచేసినప్పుడే కార్మికులకు నిజమైన న్యాయం జరుగుతుందని హితవు పలికారు.

సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో పరామర్శ

మీడియా సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పైడిరాజు, సూరిబాబు, శ్రీనివాస్ లను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల వైద్య ఖర్చుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.