Let's talk: editor@tmv.in
స్ట్రాంగ్ రూమ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు: ఈసీఐ

స్ట్రాంగ్ రూమ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు: ఈసీఐ

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు జరిగే రోజు వరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లు లేదా అన్‌సీల్‌డ్ రూమ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టం చేసింది. కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కెల్కర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. కొజికోడ్‌లోని పెరంబ్ర నియోజకవర్గంలో ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ తెరిచినట్లు వచ్చిన వార్తలు, అలాగే పాలక్కాడ్‌లోని నెన్మారాలో మరో రూమ్ తెరవాలనే యోచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇండెక్స్ కార్డులు సిద్ధం చేయడం లేదా ఎన్‌కోర్‌‌ పోర్టల్‌లో డేటా వెరిఫికేషన్ కోసం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూమ్‌లను యాక్సెస్ చేయకూడదని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, భద్రత కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత కే.మురళీధరన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గరికి ఎవరూ వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయని, అయినా ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే కొజికోడ్ జిల్లా కలెక్టర్ స్నేహిల్ కుమార్ సింగ్ వివరణ ఇస్తూ, స్ట్రాంగ్ రూమ్ తెరవలేదని తెలిపారు. కేవలం మెటీరియల్ రూమ్‌ను మాత్రమే అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో తెరిచి రికార్డులు పరిశీలించామని చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సీల్ చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

బెంగాల్‌లో బైక్ ర్యాలీలపై నిషేధం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సంఘం ఎన్నికల ముందు కఠిన ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, శాంతియుత ఎన్నికల కోసం బైక్ ర్యాలీలు, వాహనాల సంచారంపై పరిమితులు అమలు చేయాలని ఆదేశించింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ కాలంలో బైక్ ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా బైక్ ప్రయాణాన్ని పూర్తిగా ఆపేశారు. అలాగే, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా పిలియన్ రైడింగ్ (ఒక బైక్‌పై ఇద్దరు) నిషేధించారు. అయితే వైద్య అవసరాలు, కుటుంబ అవసరాలు, విద్యార్థుల రవాణాకు కొంత సడలింపు ఇచ్చారు. పోలింగ్ రోజున మాత్రం కుటుంబ సభ్యులు ఓటు వేయడానికి కలిసి ప్రయాణించేందుకు పరిమిత అనుమతి ఉంటుంది.

ఈ ఆంక్షలు అమలు చేయడానికి జిల్లా అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడమే ఈ చర్యల లక్ష్యమని అధికారులు తెలిపారు. బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్‌ 23న, రెండో దశ ఏప్రిల్‌ 29న. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.