
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: సీపీ సజ్జనార్
నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటి కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో నిర్వహించిన ఉన్నతస్థాయి రోడ్డు భద్రత సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో నగరంలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై నమోదైన ప్రమాదాల గణాంకాలు, బ్లాక్ స్పాట్లు, బ్లైండ్ స్పాట్లు, పాదచారుల ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, హిట్ అండ్ రన్ ఘటనలు తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. గత ప్రమాదాల ఆధారంగా ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ చేపట్టాల్సిన నివారణ చర్యలపై చర్చించారు.
రోడ్డు భద్రత విషయంలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సజ్జనార్ సూచించారు. సమావేశాలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రహదారులపై సూచికలు, జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం, ఆక్రమణలను తొలగించడం, అక్రమ రహదారి దాటివేతలను అరికట్టేందుకు మీడియన్లు, గార్డ్‌రైలింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, శాస్త్రీయ యూ-టర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌ల రూపకల్పనపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యమని, శాఖలు తమకు అప్పగించిన పనులపై నిర్దిష్ట గడువులోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల అమలులో సమన్వయాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు.
