Let's talk: editor@tmv.in
నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ రామకృష్ణారావు
నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ రామకృష్ణారావు

నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ రామకృష్ణారావు

Gaddamidi Naveen
7 జూన్, 2026

రాష్ట్రంలో జూన్ 21న జరగబోయే జాతీయ అర్హత‌ ప్రవేశ పరీక్ష (నీట్) ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీట్ పరీక్షల ఏర్పాట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వివిధ జిల్లాల్లో చేపట్టబోయే పర్యటనల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.

పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పక్కా ఏర్పాట్లు చేయాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలన్నారు.

208 కేంద్రాల్లో 72,956 మంది అభ్యర్థులు

ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తూ పరీక్షల సన్నద్ధతను సమావేశంలో వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 నగరాల్లో ఏర్పాటు చేసిన 208 పరీక్షా కేంద్రాలలో దాదాపు 72,956 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, రవాణా, భద్రత, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది పరీక్షల కోసం మరింత కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. పరీక్షల పవిత్రతను, భద్రతను కాపాడేందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రశ్నపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించుతున్నట్లు ఆయన వెల్లడించారు. అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులు, తప్పుడు సమాచారంపై నిరంతర నిఘా ఉంచాలని, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ధాన్యం సేకరణపై హై అలర్ట్ – సీఎం పర్యటనలు

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. సేకరించిన ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జిల్లాల్లో జరిపే పర్యటనలకు, బహిరంగ సభలకు సంబంధించి భద్రత, రవాణా, వసతి ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ డీజీపీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.