
బక్రీద్ వేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:మంత్రి అచ్చెన్నాయుడు
బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి జంతు హింసకు పాల్పడితే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రాల వారీగా భిన్నమైన చట్టాలు
దేశవ్యాప్తంగా జంతువుల రవాణా, సంరక్షణ, వధకు సంబంధించి ప్రత్యేక జాతీయ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, వాటి అనుమతులు, నిషేధాలు అనేవి ఆయా రాష్ట్రాల నిబంధనలపై ఆధారపడి ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టాల ప్రకారం. మాంసాహార అవసరాల కోసం మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు, బాతులు, చేపలు పునరుత్పత్తికి పనికిరాని గేదెలను మాత్రమే వధించేందుకు చట్టబద్ధమైన అనుమతి ఉందన్నారు.
ఆవులు, ఒంటెల వధపై పూర్తి నిషేధం
రాష్ట్రంలో ఆవులు, దూడలు మరియు ఒంటెల వధను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని మంత్రి స్పష్టం చేశారు. పండుగ పేరుతో వీటిని వధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, పశువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో జంతు సంరక్షణ చట్టాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలలో వాటి సామర్థ్యానికి మించి ఇరుకుగా పశువులను రవాణా చేయడం చట్టప్రకారం నేరమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా అక్రమంగా తరలించినా... 'జంతు హింస నివారణ చట్టం', 'ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు పశుసంరక్షణ చట్టం' కింద నిందితులపై కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయని మంత్రి తేల్చిచెప్పారు.
శాఖల సమన్వయంతో పర్యవేక్షణ
బక్రీద్ పండుగ సందర్భంగా క్షేత్రస్థాయిలోని పశువైద్య సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడా అనధికారికంగా పశువుల వధ జరగకుండా గట్టి నిఘా పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ చట్టాలు, నిబంధనలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక పోలీస్ అధికారులను సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని మంత్రి సూచించారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
