
డ్రగ్స్ విషయంలో విద్యాసంస్థల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..డీజీపీ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు పోలీసు శాఖలోని ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సి.వి. ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ విభాగం ‘ఈగిల్ ఫోర్స్’ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే డ్రగ్స్ సరఫరాను అరికట్టడంపై కఠిన ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. డ్రగ్స్ నియంత్రణ అనేది కేవలం ఒక విభాగానికి పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీలు, కమిషనర్లు ఈగిల్ ఫోర్స్‌తో కలిసి పనిచేసినప్పుడే డ్రగ్స్ రహిత తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, విద్యాసంస్థల బాధ్యతను ఆయన గుర్తుచేశారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నా కొన్ని విద్యా సంస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్‌తో పాటు ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మహిళల రక్షణ వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో సమగ్ర కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రవేశాల సమయంలోనే విద్యార్థులతో "నేను డ్రగ్స్ తీసుకోను" అని డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలని సూచించారు. ఏదైనా విద్యాసంస్థలో అక్రమ కార్యకలాపాలు జరుగుతూ, వాటిని పోలీసులకు నివేదించకపోతే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. త్వరలోనే తాను జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని ఆయన వెల్లడించారు.
గతంలో తెలంగాణలో నక్సలిజాన్ని రూపుమాపడంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, గ్రేహౌండ్స్ దళాలు ఏ విధంగా వ్యూహాత్మకంగా పనిచేశాయో, అదే స్ఫూర్తితో ఇప్పుడు డ్రగ్స్ ముఠాల ఆటకట్టించాలని డీజీపీ సూచించారు. కేవలం ఒక బ్యూరోను ఏర్పాటు చేస్తే సరిపోదని, మొత్తం పోలీసు యంత్రాంగం క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండాలన్నారు. జిల్లాల్లో జరిగే దాడులకు, కేసుల విచారణకు ఈగిల్ ఫోర్స్ అవసరమైన సాంకేతిక సహకారం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్ తరాల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల నమోదు గణనీయంగా పెరిగిందని, ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. 2023లో 1,464 కేసులు నమోదై 3,157 మంది అరెస్ట్ కాగా, 2025 నాటికి కేసుల సంఖ్య 2,734కు, అరెస్టుల సంఖ్య 5,703కు పెరిగిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఒక్కో కేసులో అరెస్టవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. కేవలం చిల్లరగా డ్రగ్స్ అమ్మేవారినే కాకుండా, వాటి వెనుక ఉన్న కీలక సూత్రధారులను సైతం పోలీసులు పట్టుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విదేశీ సిండికేట్లపై నిఘా పెంచాలని డీజీపీ ఆదేశించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ద్వారా సంపాదిస్తున్న డబ్బును వస్త్రాలు, కిరాణా సామాగ్రి చెల్లింపుల పేరుతో విదేశాలకు లాండరింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. నైజీరియా, ఘనా, సూడాన్ వంటి దేశాలకు చెందిన 93 మంది విదేశీయులను ఇప్పటివరకు దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతున్న అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు డిజిటల్ ఫోరెన్సిక్స్, జియో-లొకేషన్ ట్రాకింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడాలని ఆయన సూచించారు.
