
చార్‌ధామ్ యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ పోలీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. కేదార్‌నాథ్ ఆలయంలో దర్శన ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన వీడియోపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో సోషల్ మీడియా పర్యవేక్షణలో ఈ వీడియోను గుర్తించారు. భక్తులకు దర్శనం నిరాకరిస్తున్నారన్న తప్పుడు ప్రచారం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఇంకా 4–5 అనుమానాస్పద వీడియోలను కూడా గుర్తించి వాటిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పుడు సమాచారం, అపోహలు, దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చార్ ధామ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. సోషల్ మీడియాను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని పేర్కొంది. ఇక ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, డ్రోన్లు, వీడియో గ్రాఫీపై నిషేధం విధించారు. రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారికా తోమర్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేసిన ఇద్దరిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తులు ఆలయ నియమాలను పాటించి, క్షేత్ర పవిత్రతను కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 19న (అక్షయ తృతీయ) ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
