Let's talk: editor@tmv.in
ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ

ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ‘టెర్రరిస్ట్’ అని మాట్టాడినట్లు ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల కమిషన్‌ను బుధవారం కలిసి విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్‌లతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ బృందంలో ఉన్నారు.

క్షమాపణ చెప్పాలి

ఈసీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీతారామన్, తమిళనాడులో జరిగిన పత్రికా సమావేశంలో ఖర్గే ప్రధాని మోడీని ‘టెర్రరిస్ట్’గా పేర్కొనడం తీవ్రంగా ఖండించతగ్గ విషయమని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజా తీర్పును, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్ర నిరాశలో ఉండి, మోడీపై ద్వేషంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు తెలిపారు.

కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ఖర్గే వ్యాఖ్య ‘అసహ్యకర చర్య’ అని పేర్కొన్నారు. ఖర్గే, కాంగ్రెస్ దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఈసీ తమ వాదనలను శ్రద్ధగా విన్నదని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు.

నేనలా అనలేదు..ఖర్గే

ఇదిలా ఉండగా, చెన్నైలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గే మొదట ప్రధాని మోడీని ‘టెర్రరిస్ట్’గా పేర్కొన్నారు. అయితే విలేకరులు వివరణ కోరగా, తాను ఆ పదాన్ని ప్రత్యక్ష అర్థంలో ఉపయోగించలేదని, మోడీ ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర సంస్థలను వినియోగించి ప్రతిపక్షాలను ‘భయపెడుతున్నారని(టెర్రరైజ్‌)’ అర్థంలో చెప్పానని స్పష్టం చేశారు. మోడీ ప్రజలు, రాజకీయ పార్టీలను ‘భయపెడుతున్నారని’ తన ఉద్దేశమని, ప్రత్యక్షంగా ‘టెర్రరిస్ట్’ అన్న ఉద్దేశం కాదని తెలిపారు. మంగళవారం కూడా బీజేపీ ఈసీని కలిసి, ఖర్గేపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజా క్షమాపణ చెప్పాలని కోరింది. బీఎన్‌ఎస్ చట్టంలోని పలు విభాగాల కింద శిక్షార్హ, నియంత్రణ చర్యలు ప్రారంభించాలని మెమొరాండంలో పేర్కొంది.

ఖర్గేకు ఈసీ నోటీసు

ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ‘టెర్రరిస్ట్’గా పేర్కొన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు ఎలక్షన్‌కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్‌కు ఒక రోజు ముందు ఈ నోటీసు వెలువడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.