
బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు బూత్ స్థాయిలో పార్టీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం’లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకు తెలంగాణలో ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ రావడం అత్యంత అవసరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, అలాగే పశ్చిమ బెంగాల్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని ఆయన గుర్తుచేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయని, గతంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ల నీడలో నేరాలకు పాల్పడిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఖరే కారణమని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ పోస్టింగులకు సంబంధించిన నిర్ణయాలు సచివాలయం నుంచి కాకుండా, ఎంఐఎం ప్రధాన కార్యాలయమైన ‘దారుస్సలాం’ నుంచి నిర్దేశించబడుతున్నాయి. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వంటి అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. అక్కడ భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. అందుకే ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరిస్తూ, ప్రతి ఇంటినీ సందర్శించి అర్హులైన భారతీయ పౌరుల పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, కాలేజీ అమ్మాయిలకు స్కూటర్లు, కళ్యాణ కానుక, బీసీలకు మద్దతు, రైతు భరోసా, కౌలు రైతులకు సాయం, పంట బోనస్ వంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు.
గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల కోసం భారీగా నిధులు పెట్టుబడిగా పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేస్తూ తెలంగాణను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆరోపించిన కిషన్ రెడ్డి.. బీజేపీపై విమర్శలు చేసే ముందు తమ ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
