
జార్ఖండ్‌లో ‘నాబార్డ్’ ప్రోత్సాహంతో సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు
జార్ఖండ్‌లోని రామగఢ్ జిల్లాలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) చేపట్టిన గిరిజన అభివృద్ధి కార్యక్రమం ద్వారా సుమారు 250 మందికి పైగా రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని విడిచిపెట్టి, అగ్రో ఎకాలజీ ఆధారిత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ మార్పు వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా, పంట వైవిధ్యం, ఆదాయం గణనీయంగా పెరిగాయని క్షేత్రస్థాయి ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
పెట్టుబడి తగ్గి.. లాభం పెరిగి
కోరి గ్రామానికి చెందిన రైతు దేవాలల్ ముండా 'జీవా' కార్యక్రమం ద్వారా పొందుతున్న ప్రయోజనాలను వివరించారు. గతంలో తన 1.5 ఎకరాల్లో కేవలం వరి మాత్రమే పండించేవారని, దానికి సుమారు రూ.22,000 పెట్టుబడి అయ్యేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పుడు 'జీవామృతం' వంటి సేంద్రీయ ఎరువులను వాడటం వల్ల ఆ ఖర్చు కేవలం రూ.2,000 కు తగ్గిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నాబార్డ్ మద్దతుతో ఆదాయం పెరిగింది, పంటల వైవిధ్యం పెరిగింది. అలాగే వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా వ్యవసాయం చేయగలుగుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. జీవామృతం తయారీ కోసం 3,000 లీటర్ల సామర్థ్యం కలిగిన బయో-డైజెస్టర్ యూనిట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రసాయన ఎరువుల వల్ల నశించిన నేలలోని సూక్ష్మజీవులు, ఎర్త్‌వార్మ్స్ మళ్లీ చురుకుగా మారాయి. దీంతో నేల సారవంతత పెరిగిందని అని ముండా అన్నారు.
అర్మాదాగ్ గ్రామానికి చెందిన ప్రేమ్ బెడియా ‘వాడి’ ప్రాజెక్ట్ కింద మామిడి తోటలు అభివృద్ధి చేసి ఆదాయం పొందుతున్నారు. ఆయన మూడు ఎకరాల్లో ‘అమ్రపాలి’ , ‘మాల్దా’ రకాల మామిడి చెట్లను పెంచుతున్నారు. 2012-13లో ఈ ప్రాజెక్ట్‌లో చేరాను. అప్పట్లో 180 మొక్కలు నాటాను. వాటిని పెంచడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. ఇప్పుడు మామిడి విక్రయాల ద్వారా సంవత్సరానికి రూ.2 లక్షల ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు.
మరోవైపు, బిచా గ్రామానికి చెందిన రామకుమార్ ఒరావ్ నాబార్డ్ మద్దతుతో 2024 మధ్యలో పాలీ-క్రాపింగ్ (బహుళ పంటల సాగు) విధానాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఆయన ఐదు ఎకరాల్లో పుచ్చకాయ, దోసకాయ, టమోటా, గుమ్మడికాయ వంటి పంటలు పండిస్తూ.. రూ.1 లక్ష లాభాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో పెట్టుబడి ఖర్చు రూ.2 లక్షలుగా ఉండేదని, ఇప్పుడు అది రూ.1 లక్షకు తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
సంకి పంచాయతీ ముఖియా కోమిలా దేవి మాట్లాడుతూ.. నాబార్డ్ మద్దతుతో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు, క్రమబద్ధమైన శిక్షణ, పండించిన పంటను మార్కెట్‌కు తరలించడానికి రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ సమగ్ర ప్రయత్నాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు జరిగే వలసలు కూడా తగ్గాయని ఆమె వివరించారు.
సంస్థాగత నిర్మాణం
నాబార్డ్ జార్ఖండ్ రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడిస్తూ, గిరిజన అభివృద్ధి కార్యక్రమం కింద జార్ఖండ్‌లోని 24 జిల్లాల్లో 64 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 39,000 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. పత్రాటు బ్లాక్‌లో 2013-14లో ప్రారంభమైన ఒక ప్రాజెక్ట్ ద్వారా 1,000 కుటుంబాలకు మద్దతు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ముందుగా వర్షాధార వ్యవసాయం, తక్కువ దిగుబడులు, నేల దెబ్బతినడం, నీటి కొరత వంటి సమస్యలు ఉండేవి. రైతులు ప్రధానంగా వరి పంటపై ఆధారపడి సంవత్సరానికి రూ.25,000–30,000 మాత్రమే సంపాదించేవారు అని ఆయన వివరించారు.
2015-16లో ‘స్నేహలత ఆగ్రో ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ అనే రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ) ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఇందులో సుమారు 1,200 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా పంటల సమీకరణ, విలువ పెంపు, సమూహ మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల విజయాన్ని ఆధారంగా తీసుకుని, 2023-24లో నాబార్డ్, జర్మన్ సంస్థ జీఐజ్ కలిసి ‘జీవా’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం రాంఘర్ జిల్లాలోని పత్రాటు బ్లాక్‌లో 2,000కు పైగా కుటుంబాలకు నాబార్డ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు అందిస్తోంది. అదేవిధంగా పశ్చిమ సింగ్‌భూమ్, దుమ్కా, లోహర్దాగా, హజారిబాగ్ జిల్లాల్లో కూడా ‘జీవా’ ప్రాజెక్ట్ అమలవుతోంది. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ దీపమాల ఘోష్ మాట్లాడుతూ, జార్ఖండ్‌లో ‘జీవా’ కార్యక్రమం స్థిరమైన వ్యవసాయం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మార్గం చూపుతోంది. రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వారి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.
