
ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక శస్త్రచికిత్స విజయవంతం
ధర్మవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అత్యాధునిక వైద్య సేవలకు వేదికగా మారింది. కూటమి ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రికి సమకూర్చిన సరికొత్త డబుల్ పంచ్ లాపరోస్కోపిక్ పరికరాల సహాయంతో కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగు సంక్లిష్టమైన లాపరోస్కోపిక్ ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ స్థాయి అత్యాధునిక శస్త్రచికిత్సలు విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వైద్యుల కథనం ప్రకారం లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీతో పాటు, తీవ్రమైన కడుపు నొప్పి, ఫిట్స్ (మూర్ఛ) సమస్యలతో బాధపడుతూ అపెండిసైటిస్ బారిన పడిన రోగులకు ఈ అత్యాధునిక 'లాపరోస్కోపిక్ అపెండిసెక్టమీ' శస్త్రచికిత్సలు నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు వైద్యులు తమ నైపుణ్యంతో శస్త్రచికిత్సను విజయవంతం చేసి వారికి పునర్జన్మ ప్రసాదించారు. ప్రస్తుతం రోగులంతా కోలుకుని సురక్షితంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
ఈ అద్భుత విజయాన్ని సాధించిన ధర్మవరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెన్నా తిప్పానాయక్, వారి డాక్టర్ల బృందాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆశయమైన 'అందరికీ నాణ్యమైన వైద్యం' అందించే దిశగా వైద్యుల కృషి ఇలాగే నిరంతరం కొనసాగాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
