


అసెంబ్లీని తలపించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి ‘మాక్ అసెంబ్లీ’
హైదరాబాద్ జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసన మండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి ‘మాక్ అసెంబ్లీ’ నిజమైన అసెంబ్లీ సమావేశాలను తలపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. భవిష్యత్ మహిళా నాయకత్వాన్ని తయారు చేయడం, బాలికల్లో రాజకీయాలు, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపికైన కిశోర బాలికలు తెల్లటి ఖాదీ దుస్తులు, కండువాలు ధరించి అధికార, విపక్ష సభ్యులుగా మారి ప్రజా సమస్యలపై క్రమశిక్షణతో వాదనలు వినిపించారు. ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై సభలో లోతైన చర్చలు జరిగాయి.
టీనేజ్ బాలికల స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మొదట మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారిని ఈ రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క బాలికల ప్రతిభను అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వేదికను కల్పించామని, దీనిని విజయవంతం చేసిన సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ అనేది ఒకరినొకరు విమర్శించుకునే వేదిక కాదు. అది ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే చట్టాలు రూపొందించే పవిత్ర స్థలం, ఒక సామాజిక దేవాలయం అని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాలకు చదువు అవసరం లేదనే భావన తప్పని, సమాజ సమస్యలను అర్థం చేసుకుని సమర్థవంతంగా నాయకత్వం వహించాలంటే మంచి విద్య, విజ్ఞానం నిరంతర అధ్యయనం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం యువత రీల్స్ చూస్తూ గంటల తరబడి సమయాన్ని వృథా చేస్తోందని, అలాంటి ఆకర్షణలకు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని కిశోర బాలికలకు సూచించారు. మన మూలాలు గ్రామాల్లో ఉండొచ్చు, కానీ మన లక్ష్యాలు ప్రపంచాన్ని చేరుకోవాలని మంత్రి బాలికల్లో స్ఫూర్తి నింపారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వ చేయూత
మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వివరించారు. మహిళా సంఘాల ద్వారా ప్రతి నెల రూ. 70 వేల వరకు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తున్నామని, సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల విక్రయం కోసం హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కల్పించారన్నారు. బాలికలందరూ క్రమశిక్షణ, సంస్కారం, శ్రమ అనే విలువలను అలవర్చుకుని సమాజంలో సైనికుల్లా నిలబడాలని.. భవిష్యత్తులో ఇదే అసెంబ్లీ హాల్‌లో మంత్రులుగా, స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా మాట్లాడే స్థాయికి ఎదగాలని అన్నారు.
