
తోతాపురి మామిడి రైతులకు అండగా నిలవండి: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
తోతాపురి మామిడి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ధరల పతనంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ (పీడీపీఎస్) అమలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తోతాపురి మామిడి రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని వారికి అండగా నిలవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేయాలని నిర్ణయించిందని, ఇందుకోసం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలని ఆయన లేఖలో అభ్యర్థించారు. రైతులు నష్టాల్లో పంటను విక్రయించాల్సిన పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్) ఎగుమతులు నిలిచిపోవడం, ప్రాసెసింగ్ పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల తోతాపురి మామిడి ధరలు ఒక్కసారిగా క్షీణించాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో సుమారు 3.9 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుండగా, ఏటా దాదాపు 52.6 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదవుతోందన్నారు. ఇందులో తోతాపురి మామిడి మాత్రమే సుమారు 91,011 హెక్టార్లలో సాగవుతుండగా, ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో 8.6 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పంటపై లక్షలాది రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. పెరుగుతున్న సాగు వ్యయాలు, మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పడిపోవడం వల్ల ఈ సీజన్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేసి 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
అదనంగా రైతులకు కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు చేపట్టనున్న కొనుగోలు కార్యక్రమాలకు కేంద్రం పీడీపీఎస్ కింద ఆర్థిక సహాయం అందించడంతో పాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ సమర్థవంతంగా అమలుకు సహకరించాలని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.
