Let's talk: editor@tmv.in
తెలంగాణలో స్థిరంగా ఇంధన సరఫరా: రోజుకు 2.18 లక్షల గ్యాస్ సిలిండర్ల పంపిణీ!

తెలంగాణలో స్థిరంగా ఇంధన సరఫరా: రోజుకు 2.18 లక్షల గ్యాస్ సిలిండర్ల పంపిణీ!

Gaddamidi Naveen
15 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అలాగే వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాకు సంబంధించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఊరటనిచ్చే ప్రకటన చేశాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందేమోనన్న భయాందోళనలను ఆయిల్ కంపెనీలు పటాపంచలు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

ప్రత్యేకంగా గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తూ, వినియోగదారులకు అంతరాయం లేకుండా సకాలంలో సిలిండర్ల పంపిణీ జరుగుతోందని తెలిపాయి. యుద్ధం ప్రారంభానికి ముందు రాష్ట్రంలో సగటున రోజుకు 2,15,151 సిలిండర్లు పంపిణీ అయ్యేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 2.18 లక్షలకు పెరిగింది. ఇది సరఫరా వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. గతంలో కొరత ఏర్పడుతుందనే భయంతో వినియోగదారులు ముందస్తుగా చేసిన బుకింగ్‌ల సంఖ్య ఇప్పుడు గణనీయంగా గణనీయంగా తగ్గాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ డిమాండ్ కూడా సాధారణ స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ సరఫరా పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. రవాణాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. వినియోగదారులు ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ లేదా ఐవీఆర్ఎస్ ద్వారా సిలిండర్లను బుక్ చేసుకోవాలని, డెలివరీ సమయంలో డీఏసీ (డెలివరీ ఆథెంటికేషన్ కోడ్) తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.

వలసదారులకు ఊరట..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌‌జీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన పట్టణాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, స్థానిక అడ్రస్ ప్రూఫ్ లేని వలస కార్మికులు, విద్యార్థుల కోసం 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చారు. కేవలం గుర్తింపు కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి వీటిని పొందవచ్చని ఆయిల్ కంపెనీల స్టేట్ లెవల్ కోఆర్డినేటర్ తెలిపారు.