
శ్రీకాకుళాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేస్తాం:మంత్రి రామ్ మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపాలెంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్ డీబీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉదయ్ ఆక్వా’ పరిశ్రమను కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే డా. అశోక్, జిల్లా అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌లో చేపడుతున్న కార్యకలాపాలను, జిల్లాలో మత్స్య సంపద వృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరంగా తెలుసుకున్నారు.
జిల్లాలో మత్స్య రంగం అభివృద్ధి ద్వారా ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశాలపై మంత్రి దృష్టి సారించారు. శ్రీకాకుళాన్ని ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొదటి కార్యాచరణను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్ఎఫ్ డీబీ ఆధ్వర్యంలో జిల్లాలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరాన్ని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. విశాలమైన సాగర తీరం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో మత్స్య సంపదను సమర్థంగా వినియోగిస్తే విశేష ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తాయని మత్స్యకారులకు ఆయన హామీ ఇచ్చారు.
