
శ్రీ సత్యసాయి జిల్లా పేలుడు ఘటన…జెలటిన్ స్టిక్స్ ప్రమాదానికి కారణం: జిల్లా పోలీస్
శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలోని కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భీభత్సానికి కారణాలను పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 జెలటిన్ స్టిక్స్, అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో కుమ్మరవాండ్లపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పోలీసుల వివరాల ప్రకారం సుమారు పదేళ్ల క్రితం తెలంగాణలోని నల్గొండ జిల్లా నుండి వలస వచ్చిన వెంకన్న, సంపత్ అనే వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు క్వారీలలో రాళ్లను పేల్చే బ్లాస్టింగ్ కాంట్రాక్టులు చేస్తుంటారు. బుధవారం తెల్లవారుజామున వెంకన్న ఇంట్లో టీ తయారు చేస్తుండగా గ్యాస్ పైపు విడిపోయి లీకేజీ ఏర్పడింది. మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.
సాయం చేయబోయి బలైన కూలీలు
ఇంట్లో మంటలు చెలరేగడం గమనించిన పొరుగున ఉన్న భవన నిర్మాణ కూలీలు, స్థానికులు ఆర్పేందుకు లోపలికి వెళ్లారు. అయితే ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయన్న విషయాన్ని వెంకన్న కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పలేదు. సరిగ్గా అదే సమయంలో గ్యాస్ వేడికి ఇంట్లో ఉన్న జెలటిన్ స్టిక్స్, అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఒక్కసారిగా పేలాయి. ఈ ధాటికి ఇల్లు పేకమేడలా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మధుసూదన్, విశ్వనాథరెడ్డి, అస్లాం బాషా, మాబున్నీసా అనే నలుగురు వ్యక్తులు శిథిలాల కింద పడి మరణించారు.
క్షేత్రస్థాయిలో విధ్వంసం
పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే వెంకన్న ఇల్లు సహా పక్కనే ఉన్న మరో ఇల్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ మేర వినిపించడంతో స్థానికులు భూకంపం వచ్చిందని భావించి భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. క్షతగాత్రులను వెంటనే కదిరి ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.
ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య పేలుడు పదార్థాలను దాచినందుకు వెంకన్న, సంపత్‌లపై భారత న్యాయసంహిత పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
