Let's talk: editor@tmv.in
చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: మంత్రి కొండా సురేఖ

చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: మంత్రి కొండా సురేఖ

Gaddamidi Naveen
14 మే, 2026

పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే చిత్తడి నేలల గుర్తింపు నోటిఫికేషన్ ప్రక్రియను రాష్ట్రంలో వేగవంతం చేయాలని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె చిత్తడి నేలల పరిరక్షణ, నిర్వహణ నియమావళి-2017ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని అన్ని వెట్‌ల్యాండ్స్‌కు సంబంధించిన సరిహద్దుల గుర్తింపు, డిజిటల్‌ మ్యాపింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. చిత్తడి నేలల సంరక్షణలో శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామీణ, స్థానిక స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సమావేశంలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్‌ అట్లాస్‌’లో గుర్తించిన 12,249 వెట్‌ల్యాండ్స్‌కు సంబంధించి గ్రౌండ్‌ ట్రూతింగ్‌ ప్రక్రియ పూర్తయింది. వీటిలో ఇప్పటివరకు 4,023 వెట్‌ల్యాండ్స్‌ సరిహద్దులను గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వేలు పూర్తి చేసి ‘బ్రీఫ్‌ డాక్యుమెంట్స్‌’ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. జిల్లా వెట్‌ల్యాండ్‌ అథారిటీల నుంచి ఖచ్చితమైన నివేదికలు అందేలా శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రధాన వెట్‌ల్యాండ్స్‌తో పాటు 28 ప్రాంతాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమావేశంలో వెల్లడించారు. ఇవి త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్‌, ప్రజాభిప్రాయ సేకరణ దశలకు వెళ్లనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, సంగారెడ్డి జిల్లాలోని మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్‌సార్‌ సైట్‌గా గుర్తింపు పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయని, తుది అభిప్రాయాల అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.