
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయండి: సీఈవో ఆదేశం
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్‌ఓలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో 90 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రెసిడెన్షియల్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని, ఈఆర్ఓలు, బీఎల్ఓలు స్వయంగా మురికివాడలు, గేటెడ్ కమ్యూనిటీలను సందర్శించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా తమ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్లను (బీఎల్ఓలు) సంప్రదించి మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలని కోరారు. బీఎల్ఓల వివరాలు సీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓటర్లకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాలు, రేషన్ డీలర్లు, ఉద్యోగ సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆయన ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో కఠిన నిబంధనలు
మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన వారు, శాశ్వతంగా చిరునామా మారిన వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఆవో సూచించారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.
సర్ మ్యాపింగ్ పురోగతిని సమీక్షించేందుకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. బీఎల్‌ఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తులతో సమాచారం లేదా ఓటీపీలు పంచుకోరాదని హెచ్చరించారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏలు) సహాయాన్ని కేవలం ఇళ్లను లేదా ఓటర్లను గుర్తించేందుకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. తప్పుడు మ్యాపింగ్‌లను తక్షణమే సరిదిద్దాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవో డాక్టర్ వాసన్ వెంకటేశ్వర రెడ్డి, నోడల్ అధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.
