
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఈ అంశంపై కీలక దిశానిర్దేశం చేశారు.
రైతుల నుంచి పంటల కొనుగోలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని సీఎం పేర్కొన్నారు. అధికారులు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, లారీల్లోకి ధాన్యం బస్తాలను చేరవేసేందుకు అవసరమైన కార్మికులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న కార్మికులను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు అని సీఎం తెలిపారు.
రైతులకు ఇబ్బందులు కలగవద్దు
ప్రస్తుత తీవ్రమైన ఎండలు, అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా మండల స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించి రైతులను అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒప్పందం ప్రకారం తగినన్ని లారీలను ఏర్పాటు చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని మిల్లులకు, గోదాములకు తరలించేందుకు లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సమకూర్చాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
గోదాముల సమస్య ఉన్న ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను ఉపయోగించి ధాన్యం నిల్వ చేయాలని సీఎం సూచించారు. అనంతరం వాటిని దశలవారీగా గోదాములకు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మొక్కజొన్న ఎక్కువగా వచ్చే జిల్లాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
కలెక్టర్లదే పూర్తి బాధ్యత
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాల్సిన బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఐకేపీ కేంద్రానికి ఒక అధికారిని, ప్రతి రైస్ మిల్లుకు బాధ్యతగల అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికలు పంపాలని ఆదేశించారు. విధుల్లో విఫలమయ్యే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు, ధాన్యంలో తేమ శాతం పేరిట రైతులను వేధించడం వంటి అంశాలపై ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ఈ చర్యలు చేపట్టింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీ వేం. నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.
