
మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కొనుగోళ్లు, నిల్వ సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతుల నుంచి 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేపట్టకపోయినా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో రూ.4,000 కోట్ల వ్యయంతో మొక్కజొన్న కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జొన్న పంట కొనుగోలుకు కూడా ప్రభుత్వం రూ.1,100 కోట్లతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
సేకరించిన మొక్కజొన్న నిల్వ కోసం రాష్ట్రానికి మొత్తం 15.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉందని ఇంకా 3.29 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సదుపాయం అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు గోదాములను వెంటనే గుర్తించి ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం మూడు కోట్ల గన్ని బ్యాగులు అవసరమవుతుండగా ఇప్పటివరకు రెండు కోట్ల గన్ని బ్యాగులు మాత్రమే సరఫరా అయినట్లు తెలిపారు. మిగిలిన ఒక కోటి గన్ని బ్యాగులను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తీసుకొచ్చిన పంటను ఆలస్యం లేకుండా తూకం వేసి గోదాములకు తరలించేలా తగిన సంఖ్యలో లారీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు పంట తరలింపులో ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పందన రాలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రస్తుతం పీఎస్‌ఎస్ పరిధిలో ఉన్న శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై అమలులో ఉన్న 25 శాతం సీలింగ్‌ను వెంటనే 50 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రికి మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌లో చేర్చేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమమే లక్ష్యంగా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
