Let's talk: editor@tmv.in
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి:ఏపీ సీఎం

అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి:ఏపీ సీఎం

Panthagani Anusha
9 మే, 2026

ప్రభుత్వ పాలనలో వేగం, పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే వదిలేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని అటువంటి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇకపై ప్రతి శుక్రవారాన్ని 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే'గా నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఉమ్మడిగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

టెక్నాలజీతో వేగవంతమైన సేవలు – వాట్సాప్ గవర్నెన్స్

పాలనలో టెక్నాలజీని పెద్దపీట వేయాలని సూచిస్తూ, 'ఈ-ఫైళ్ల' క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించిన అధికారులను సీఎం అభినందించారు. గత మూడు నెలల్లో ఫైళ్ల పరిష్కార సమయం 10 రోజుల నుండి 2 రోజులకు తగ్గిందని దీనిని 24 గంటల లోపుకు తీసుకురావాలని లక్ష్యంగా విధించారు. ముఖ్యంగా 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 90 శాతం ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తెచ్చామని డిసెంబర్ నాటికి అన్ని సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆదేశించారు. పరిపాలనలో కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, 'హ్యూమన్ టచ్' (మానవీయ కోణం) కూడా ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.

2027 నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం

రాష్ట్రంలో "ప్రతి పేదవాడికి ఇల్లు" లక్ష్యాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని కొండ ప్రాంతాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణకు అవసరమైతే కేబినెట్ ఆమోదం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంక్షేమ పథకాలు - సామాజిక న్యాయం

పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమం ద్వారా 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరియు తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ శిక్షణ విదేశీ ఉపాధి కోసం జర్మన్ భాషా శిక్షణ వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రతి జిల్లా కలెక్టర్ నెలకు ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని, సమస్యల పరిష్కారానికి 'గుడ్ విల్ మిషన్' లాగా పనిచేయాలని సీఎం సూచించారు. అక్రమ కట్టడాలపై కఠినంగా ఉండాలని తీరప్రాంతాల్లో సీవీడ్ సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అరకు కాఫీని ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతిమంగా ప్రజల సమయాన్ని వృధా చేయకుండా, అవినీతికి తావులేకుండా సేవలు అందించడమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.