Let's talk: editor@tmv.in
సూరత్ నుంచి బెంగాల్‌కు ‘స్పెషల్ ట్రైన్లు’: టీఎంసీ ఫిర్యాదు

సూరత్ నుంచి బెంగాల్‌కు ‘స్పెషల్ ట్రైన్లు’: టీఎంసీ ఫిర్యాదు

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు అమల్లో ఉన్న 48 గంటల సైలెంట్‌ పీరియడ్‌లో, సూరత్ నుంచి బెంగాల్‌కు ప్రత్యేక ఉచిత రైళ్లు నడిపించారని ఆరోపిస్తూ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బీజేపీపై ఈసీకి ఫిర్యాదు చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ తన ఫిర్యాదులో, బీజేపీ గుజరాత్ యూనిట్ సహా పార్టీ వర్గాలు సూరత్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వలస కార్మికులను (బెంగాల్ ఓటర్లు) తీసుకురావడానికి ఉచిత ప్రయాణం, ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన అని అన్నారు.

ఈ ఆరోపణలకు ఆధారంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ‘సుధానిధి బందోపాధ్యాయ్‌’ అనే యూజర్ పెట్టిన వీడియో పోస్టును సూచించారు. ‘ సూరత్‌ నుంచి బెంగాల్‌కు బీజేపీ ప్రత్యేక రైళ్లు’ అనే క్యాప్షన్‌తో రైలు బయలుదేరుతున్న దృశ్యాలు ఉన్నాయని ఫిర్యాదులో జతచేశారు.

డెరెక్ ఓ’బ్రియన్ వాదన ప్రకారం, ఇండియన్ రైల్వేస్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో, దాన్ని ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించరాదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఖర్చు పార్టీ భరించినా కూడా, ఓటర్లకు ఉచిత రవాణా, ఉపాహారాలు అందించడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు/కార్యకర్తలకు షోకాజ్ నోటీసులు జారీ , సంబంధితులపై కేసులు నమోదు చేయాలని, ఈ ‘స్పెషల్ ట్రైన్ల’పై చేసిన మొత్తం ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో చేర్చాలని ఆదేశించాలని టీఎంసీ కోరింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఈసీకి తెలిపింది. ఈ ఆరోపణలపై బీజేపీ నుంచి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు.