Let's talk: editor@tmv.in
తెలంగాణలో జూన్ 15 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ

తెలంగాణలో జూన్ 15 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ

Panthagani Anusha
17 మే, 2026

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను జూన్‌ 15 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుధర్షన్‌ రెడ్డి తెలిపారు. ఈ విషయమై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

సుధర్షన్‌ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం జూన్‌ 15 నుంచి 24 వరకు ప్రాథమిక ఓటరు జాబితా తయారీ చేపడతారు. అనంతరం జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ధృవీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో సుమారు 35 వేల మంది బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) పాల్గొంటారు. వారు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేసి, తరువాత భర్తీ చేసిన ఫారాలను సేకరిస్తారు.

జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తామని సుధర్షన్‌ రెడ్డి తెలిపారు. అనంతరం అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చివరిసారిగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాల్లోని లోపాలను సరిచేయడం రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా అర్హత కలిగిన ఒక్క పౌరుడు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకూడదు. అర్హత లేని వ్యక్తి జాబితాలో ఉండకూడదు అన్నదే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.

అయితే ముసాయిదా ఓటరు జాబితా విడుదల అనంతరం పోలింగ్‌ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఉండగా మొత్తం 3.40 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

రాజకీయ పార్టీలతో ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు నిర్వహించినట్లు సుధర్షన్‌ రెడ్డి తెలిపారు. బూత్‌ స్థాయి ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించాలని అన్ని పార్టీలను కోరినట్లు చెప్పారు. బీఎల్ఏలు ఓటర్ల గుర్తింపు, ఇళ్ల ధృవీకరణలో బీఎల్ఓలకు సహకరిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించాయని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు కొనసాగించాలని కోరిన విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రస్తుతం నిర్ణయించిన గడువులోనే ప్రక్రియను పూర్తి చేయనున్నామని, అవసరమైతే అదనపు సమయం కోరే అవకాశం ఉంటుందని సుధర్షన్‌ రెడ్డి వెల్లడించారు.