
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి:సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఇందుకోసం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభ రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తక్షణమే తీసుకురావాలని ఇందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వెలుపల ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మహిళల రాజకీయ సాధికారతకు రాజీవ్ గాంధీ చేసిన అమోఘమైన కృషిని గుర్తుచేసుకున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయంగా ముందంజలో నిలిపిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు.
కేంద్రం వైఖరిపై విమర్శలు
2023లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయని సీఎం గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా క్లిష్టతరం చేసి, రాజ్యాంగ సవరణ అవసరమయ్యేలా మార్చిందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అమలును నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంతో ముడిపెట్టడం సరైంది కాదని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి “అడ్డంకులు” సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.
పాత బిల్లుల తిరస్కరణ ప్రస్తావన
ఈ ఏడాది ఏప్రిల్‌లో, 2029 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు చేయడం లోక్‌సభ స్థానాల సంఖ్యను 816కు పెంచడం లక్ష్యంగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో తిరస్కరణకు గురైన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాలయాపన చేయకుండా తక్షణ అమలే లక్ష్యంగా కొత్త బిల్లును తీసుకురావాలని ఆయన కోరారు.
మహిళా సాధికారతతో పాటు ఐటీ, టెలికాం రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి రాజీవ్ గాంధీ చేసిన ఆధునిక సంస్కరణలను దేశానికి ఆయన అందించిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
