Let's talk: editor@tmv.in
ఖైదీల మానసిక పరివర్తనపై ప్రత్యేక దృష్టి సారించండి : హోం మంత్రి అనిత

ఖైదీల మానసిక పరివర్తనపై ప్రత్యేక దృష్టి సారించండి : హోం మంత్రి అనిత

Panthagani Anusha
13 మే, 2026

రాష్ట్రంలోని జైళ్ల శాఖను ఆధునీకరించడం ఖైదీల పరివర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం నిర్వహించిన జైళ్ల శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని, జైళ్లలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు చేపట్టాల్సిన సంస్కరణలపై దిశానిర్దేశం చేశారు.

జైళ్లలో ప్రధాన సమస్యగా ఉన్న అధిక రద్దీని అరికట్టేందుకు తక్షణమే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలో భాగంగా ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న జైళ్లను త్వరితగతిన పునరుద్ధరించాలని అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక జైలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

కేవలం శిక్ష విధించడమే కాకుండా ఖైదీలలో మానసిక పరివర్తన తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత తెలిపారు. ఇందుకోసం జైళ్లలో డీ-అడిక్షన్ సెంటర్లు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు. ఖైదీలు విడుదలైన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా విభిన్న రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయాలని వారికి ఉపాధి మార్గాలను చూపేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇక భద్రతా పరంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా జైళ్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని మంత్రి ఆదేశించారు. పెరోల్‌పై విడుదలైన ఖైదీల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వీటితో పాటు జైళ్ల శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ ఆధునికీకరణపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు.