
పంట మార్పిడిపై శాసనసభలో ప్రత్యేక చర్చ
రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు, నేల సారాన్ని కాపాడేందుకు పంట మార్పిడి విధానాలపై రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) కీలక నివేదికను రూపొందించింది. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి నేతృత్వంలోని సభ్యుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ నివేదికను అందజేసింది.
శాసనసభలో ప్రత్యేక చర్చ
నివేదికను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లాభదాయకమైన వ్యవసాయ విధానాల గురించి ప్రభుత్వం సమగ్రమైన చర్చ జరపాలని భావిస్తోందని, ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు, అమలులో ఎదురయ్యే సవాళ్లపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. పంట మార్పిడి విధానాలపై కేవలం ప్రాథమిక నివేదికతో సరిపెట్టకుండా, మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కమిషన్‌ను కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, రైతులకు మేలు చేసేలా మరింత నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్, సునీల్, రాంగోపాల్ రెడ్డి, జి. గంగాధర్, కేవీ నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ కొత్త విధానాలు రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని కమిషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
