Let's talk: editor@tmv.in
అనంతగిరిలో ఎకో అర్బన్ పార్క్ ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

అనంతగిరిలో ఎకో అర్బన్ పార్క్ ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Panthagani Anusha
21 ఏప్రిల్, 2026

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఎకో అర్బన్ పార్క్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, అనంతగిరి సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఇది ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు విస్తారంగా ఉన్నాయని తెలిపారు.

అదేవిదంగా పర్యావరణ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ ఇచ్చారు. మరిన్ని కాటేజీలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. పీసీసీఎఫ్ డా. సువర్ణ మాట్లాడుతూ అనంతగిరి అటవీ ప్రాంతం సుమారు 3,600 ఎకరాల్లో విస్తరించి ఉండి ప్రత్యేక భౌగోళిక లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. పచ్చిక బయళ్ళు, రాతి భూభాగం, ఔషధ మొక్కలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని వివరించారు.

మరోవైపు పార్కులో నిర్మించిన రెండు గెజిబోలు, ఒక వాచ్ టవర్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ నిర్మాణాల ద్వారా అడవులు, గ్రామాలు, సరస్సులు, వ్యవసాయ క్షేత్రాల అందమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఛత్రి సూర్యోదయ వీక్షణ కేంద్రంతో పాటు సూర్యాస్తమయ దృశ్యాల కోసం ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

తరువాత స్పీకర్ మూసీ నది జన్మస్థానమైన ముచికుండను సందర్శించి సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. నదీ పరివాహక ప్రాంతాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, పీసీసీఎఫ్ డా. సువర్ణ (ఐఎఫ్ఎస్), అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ సునీత భగవత్ (ఐఎఫ్ఎస్), సీసీఎఫ్ డా. ప్రియాంక వర్గీస్ (ఐఎఫ్ఎస్), పర్యాటక విభాగం డైరెక్టర్ రంజిత్ నాయక్ (ఐఎఫ్ఎస్), డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

అనంతగిరిలో ఎకో అర్బన్ పార్క్ ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Tholi Paluku