


భారత్ చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్
భారతదేశం-దక్షిణ కొరియా దేశాల మధ్య దౌత్య బంధం సరికొత్త శిఖరాలకు చేరనుంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, ప్రథమ మహిళ కిమ్ హీ-క్యుంగ్‌తో కలిసి ఆదివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఒక దక్షిణ కొరియా దేశాధినేత భారత గడ్డపై అడుగుపెట్టడం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆదివారం విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, లీ జే మ్యూంగ్‌తో భేటీ అయి.. నేడు జరగనున్న ఉన్నత స్థాయి చర్చల కార్యచరణపై సమీక్షించారు. 2025లో బాధ్యతలు చేపట్టిన లీ జే మ్యూంగ్, భారత్‌తో 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనకు వచ్చారు.
నేడు హైదరాబాద్ హౌస్‌లో కీలక చర్చలు
అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ పర్యటనలో నేడు అత్యంత కీలకమైన రోజు. ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు సంప్రదాయబద్ధంగా సైనిక వందనంతో స్వాగతం పలుకుతారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు.
మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. సెమీకండక్టర్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా కొరియా సాంకేతికతతో భారత్‌లో రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
వ్యాపార దిగ్గజాలతో భారత్ మండపంలో భేటీ
ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడమే ధ్యేయంగా భారత్ మండపంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫోరమ్‌లో అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత సరళతరం చేయడం, సరఫరా గొలుసులో స్థిరత్వం పెంచుకోవడంపై ఇక్కడి పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. దక్షిణ కొరియా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో బలమైన ముద్ర వేయగా, ఈ పర్యటనతో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కొత్త వ్యూహం
ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్, దక్షిణ కొరియాల మధ్య సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కీలకం కానుంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా, భారత్‌ను తన 'గ్లోబల్ సౌత్' దౌత్యంలో ప్రధాన భాగస్వామిగా పరిగణిస్తోంది. చివరగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తన పర్యటనను ముగిస్తారు. సాంస్కృతిక బంధాలు, ప్రజల మధ్య సంబంధాలు ఈ పర్యటనతో సరికొత్త స్థాయికి చేరుతాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
