Let's talk: editor@tmv.in
జూన్ 1 నుంచి ‘దక్షిణ కోస్తా రైల్వే’ జోన్ కార్యకలాపాలు: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి

జూన్ 1 నుంచి ‘దక్షిణ కోస్తా రైల్వే’ జోన్ కార్యకలాపాలు: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి

Panthagani Anusha
6 మే, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జూన్1, 2026 నుంచి ఈ కొత్త రైల్వే జోన్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర రవాణా రంగంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ, అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర కృషి, కేంద్రంతో జరిపిన చర్చల ఫలితంగానే ఈ జోన్ ఏర్పాటు సాధ్యమైందని ఆయన కొనియాడారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో జోన్ ఏర్పాటుపై ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి ఊతం

కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. "విశాఖ కేంద్రంగా జోన్ రావడం వల్ల కొత్త రైళ్ల రాక పెరుగుతుంది. రైల్వే లైన్ల విస్తరణ ఆధునికీకరణ పనులు వేగవంతం అవుతాయి. వీటన్నిటికీ మించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక రవాణాకు ఈ జోన్ వెన్నెముకగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.