

సానుకూల దృక్పథంతో ఆర్టీసీ సమస్యల పరిష్కారం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు, టీజీఆర్టీసీ జేఏసీ నేతలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే, ఈ విషాదకర సమయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని, ప్రతిపక్షాలు మానవత్వంతో కుటుంబానికి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ప్రసంగించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఆయన, ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అప్పటి పాలకులు కార్మికుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారని భట్టి విమర్శించారు. తాము గత పాలకుల వలె వ్యవహరించబోమని, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చల ద్వారా సమస్యలను కొలిక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
జేఏసీ నాయకులు మంత్రుల బృందం ముందు మొత్తం 32 డిమాండ్లను ఉంచారు. వీటిలో ఇప్పటికే 29 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మిగిలిన మూడు కీలక అంశాలైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు గుర్తింపు, పీఆర్‌సీ అమలు వీటిపై ప్రస్తుతం లోతైన చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడులూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, దాన కిషోర్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం పాల్గొన్నారు.
సీఎం, కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్మికులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముత్తోజీపేటను సందర్శించి శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతదేహాన్ని కనీసం ఐదు నిమిషాల పాటు డిపో వద్దకు తీసుకెళ్లడానికి అనుమతించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వం కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా అన్ని డిపోల వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు సంఘీభావం తెలుపుతామని పేర్కొన్నారు.
సొంత ఇల్లు కడతానన్నాడు.. మాకు నిలువ నీడ లేకుండా పోయాడు
ఆయనే మాకు ఏకైక ఆధారం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? అంటూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భార్య లత వ్యక్తం చేసిన ఆవేదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వరంగల్ జిల్లా ముత్తోజీపేట గ్రామంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో లత మాట్లాడుతూ తన భర్త పడిన వేదనను వివరించారు.
ఆ రోజు ఏం జరిగింది?
గురువారం నర్సంపేట బస్సు స్టేషన్ వద్ద జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ లత కన్నీరుమున్నీరయ్యారు. భోజనానికి ఇంటికి రమ్మని కోరాను. కానీ, నిరసన స్థలంలోనే భోజన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. మధ్యాహ్నం నేను కూడా వస్తానంటే.. ఇది డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన నిరసన అని, నువ్వు రావద్దు అని వారించారు అని ఆమె తెలిపారు. సమ్మె కారణంగా ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నారని గమనించి, తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి ఆయన పరిస్థితిని వివరించినట్లు లత పేర్కొన్నారు. అయితే, కొద్దిసేపటికే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్త తనను నివ్వెరపరిచిందని చెప్పారు. అక్కడ పోలీసులు, అంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండగా ఆయన్ని ఎందుకు కాపాడలేకపోయారు? అని ఆమె ప్రశ్నించారు.
శంకర్ గౌడ్ కుటుంబానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదని ఈ సందర్భంగా వెల్లడైంది. మేము ఎప్పుడూ అద్దె ఇళ్లలోనే ఉన్నాం. సొంత ఇల్లు కట్టుకుందామని నేను అంటే.. డబ్బులు సంపాదించిన తర్వాత తర్వాత కడదాం అని అనేవారు. ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని ఉంచడానికి కూడా మాకు ఇల్లు లేదు, అందుకే మా కూతురు ఇంటికి తీసుకువచ్చాం అని లత ఏడుస్తూ చెప్పారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా నిలవాలని, తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆమె వేడుకున్నారు.
కూతురు శాలిని జ్ఞాపకాలు
శంకర్ గౌడ్ కుమార్తె శాలిని తన తండ్రి గురించి మాట్లాడుతూ.. నాన్న మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే నన్ను, నా తమ్ముడిని సమానంగా చూసుకుంటానని మాటిచ్చారు. అద్దె ఇళ్లలో ఉన్నా మమ్మల్ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా పెంచారు అని గుర్తు చేసుకున్నారు.
తోటి కార్మికుల నివాళి
శంకర్ గౌడ్‌ను అందరూ 'శంకర్ అన్న' అని ఆప్యాయంగా పిలుచుకునేవారని ఆయన సహచరులు తెలిపారు. ఆయన ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండేవారని, అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన శంకర్ గౌడ్, సమ్మె పని పరిస్థితులపై చాలా కాలంగా ఆందోళన చెందుతున్నారని వారు వెల్లడించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుమారుడికి ఉద్యోగం, కుటుంబానికి ఇల్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
అంత్యక్రియలు
నిరసన ప్రదర్శనలో భాగంగా పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న శంకర్ గౌడ్, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మరణించారు. ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు తొలుత నిరాకరించినప్పటికీ, తోటి కార్మికుల ఒత్తిడి మేరకు అనుమతించారు. అనంతరం సాయంత్రం ముత్తోజీపేట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర 32 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్ 22 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ గౌడ్ మృతితో ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది.
