Let's talk: editor@tmv.in
గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పెద్దపల్లి జిల్లాలో ధర్మారం మండలంలో పర్యటించి, సుమారు రూ. 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా, తానే స్వయంగా గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడంతో పాటు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రాథమిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. యువత కోసం ధర్మారంలో మినీ స్టేడియం, ఎర్రగుంటపల్లిలో సాంకేతిక విద్య కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తామని, ఇందులో 75శాతం సీట్లు గిరిజన విద్యార్థులకు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు.

రైతులకు భరోసా

ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అవసరమైతే ధర్మారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సబ్సిడీ పథకాల కింద 61 మంది రైతులకు రూ.18.24 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 23 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు, ఒకరికి షాదీ ముబారక్ చెక్కు, పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని, తాను వారంలో మూడు రోజులు నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.