Let's talk: editor@tmv.in
భారతదేశంలో సామాజిక భద్రత.. బీమా పథకాలు

భారతదేశంలో సామాజిక భద్రత.. బీమా పథకాలు

Dantu Vijaya Lakshmi Prasanna
30 ఏప్రిల్, 2026

బలమైన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రిస్క్ ప్రొటెక్షన్ వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ క్రమంలో బీమా అనేది కేవలం ఒక ఆర్థిక ఒప్పందం మాత్రమే కాదు, వ్యక్తులు, వ్యాపారాలు తమ రిస్కులను ఇన్సూరర్లకు బదిలీ చేసే ఒక రక్షణ కవచం. బీమా ద్వారా సామాన్య గృహాలు,సంస్థలు అనుకోని విపత్తుల నుండి కోలుకోవడానికి వీలవుతుంది. తమ కష్టార్జితమైన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయకుండా లేదా ఆస్తులను అమ్ముకోకుండానే ఆర్థికంగా నిలదొక్కుకునేలా బీమా తోడ్పడుతుంది. ఇది ఆదాయాన్ని, ఆస్తులను రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో ఒక కీలక భాగమై, సమాజంలో ఆర్థిక నిలకడను నిర్ధారిస్తుంది. భారతదేశంలో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు, జీవనోపాధి రిస్కుల నేపథ్యంలో, సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో బీమా పాత్ర అనిర్వచనీయం.

‘సబ్కా బీమా, సబ్కీ రక్షా’ చట్టం - 2025

భారత ప్రభుత్వం 2025లో ప్రవేశపెట్టిన ‘సబ్కా బీమా, సబ్కీ రక్షా’ చట్టం దేశీయ బీమా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ చట్టం ద్వారా బీమా కంపెనీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74శాతం నుండి ఏకంగా 100శాతంకి పెంచారు. దీనివల్ల అంతర్జాతీయ సాంకేతికత, భారీ మూలధనం భారత మార్కెట్లోకి ప్రవేశించి, బీమా సేవలు సామాన్యులకు మరింత చేరువవుతాయి. వ్యాపార సరళీకరణలో భాగంగా, బీమా మధ్యవర్తులకు 'వన్-టైమ్ రిజిస్ట్రేషన్' విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, విదేశీ రీ-ఇన్సూరెన్స్ కంపెనీల కనీస నిధుల అవసరాన్ని రూ.5,000 కోట్ల నుండి రూ.1,000 కోట్లకు తగ్గించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు సాగించడం సులభతరమైంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తూ, పాలసీదారుల డేటా భద్రత కోసం ఈ చట్టాన్ని 'డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023'తో అనుసంధానించారు.

వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా, ప్రభుత్వం సెప్టెంబర్ 2025 నుండి వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై ఉన్న 18శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల ప్రీమియం ధరలు తగ్గి, బీమా సామాన్యుడికి మరింత భారం లేకుండా అందుబాటులోకి వచ్చింది. పాలసీదారుల రక్షణను కఠినతరం చేస్తూ, తప్పుడు మార్గాల్లో లాభాలు గడించే కంపెనీలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఐఆర్డీఏఐకి కట్టబెట్టారు. నిబంధనల ఉల్లంఘనకు విధించే గరిష్ట జరిమానాను రూ.1 కోటి నుండి రూ.10 కోట్లకు పెంచడం ద్వారా కంపెనీలలో జవాబుదారీతనాన్ని పెంచారు. అలాగే 'పాలసీ హోల్డర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్' ద్వారా పౌరుల్లో బీమా పట్ల అవగాహన పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఆరోగ్య బీమా రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు పాలసీదారులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా, మోరటోరియం కాలాన్ని 8 ఏళ్ల నుండి 5 ఏళ్లకు (60 నెలలు) తగ్గించారు. అంటే, ఐదేళ్ల పాటు ప్రీమియం కట్టిన తర్వాత, మోసం నిరూపితమైతే తప్ప ఇతర కారణాలతో కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించలేవు. పాలసీ తీసుకున్న తర్వాత ఆలోచించుకోవడానికి 30 రోజుల 'ఫ్రీ-లుక్ పీరియడ్' కల్పించారు. గతంలో క్లెయిమ్‌లు ఉన్నాయనే నెపంతో పాలసీ రెన్యూవల్‌ను నిరాకరించే వీలు లేకుండా 'గ్యారెంటీడ్ రెన్యూవల్' సౌకర్యం కల్పించారు. ఆయుష్ చికిత్సలకు కూడా బీమా వర్తింపజేయడం, క్లెయిమ్ చేయని వారికి 'నో క్లెయిమ్ బోనస్' ఇవ్వడం, మధ్యలో పాలసీ రద్దు చేసుకుంటే ప్రీమియం రీఫండ్ చేయడం వంటి చర్యలు బీమా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఐఆర్‌డీఏఐ నిర్దేశించుకున్న 2047 నాటికి అందరికీ బీమా అనే దార్శనికత భారత బీమా రంగంలో పెను మార్పులకు నాంది పలికింది. ప్రతి పౌరుడికి తగిన జీవిత, ఆరోగ్య, ఆస్తి బీమా ఉండాలని, అలాగే ప్రతి వ్యాపార సంస్థకు తగిన రిస్క్ ప్రొటెక్షన్ లభించాలని ఈ లక్ష్యం ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం భారత బీమా రంగం నియంత్రణ సంస్కరణల ద్వారా గొప్ప రూపాంతరాన్ని చెందుతోంది. పాలసీల ధరలను తగ్గించడం, వినియోగదారుల రక్షణను పెంచడం, కంపెనీలకు ఆవిష్కరణల కోసం స్వేచ్ఛను ఇవ్వడం వంటి చర్యల వల్ల బీమా రంగం అందరికీ అందుబాటులోకి వస్తోంది. ఈ పరిణామాలు భారతదేశ సామాజిక భద్రతా చట్రంలో బీమాను ఒక అంతర్భాగంగా మారుస్తూ, దేశ ఆర్థిక శక్తిని మరింత పెంచుతున్నాయి.

గణాంకాల పరంగా చూస్తే, భారత బీమా రంగం అద్భుతమైన వృద్ధి పథంలో పయనిస్తోంది. స్విస్ రే నివేదిక ప్రకారం, నామినల్ ప్రీమియం వాల్యూమ్ పరంగా భారత్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీమా వ్యాప్తి 3.7శాతంగా ఉండగా, అందులో లైఫ్ ఇన్సూరెన్స్ వాటా 2.7శాతం, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ వాటా 1శాతంగా ఉంది. బీమా సాంద్రత స్వల్పంగా పెరిగి 97 డాలర్లకు చేరుకుంది. ఈ కాలంలో ఏకంగా 41.84 కోట్ల పాలసీలు జారీ చేయడం, రూ. 11.93 లక్షల కోట్ల ప్రీమియం వసూలు చేయడం, రూ. 8.36 లక్షల కోట్ల క్లెయిమ్‌లను సెటిల్ చేయడం ద్వారా ఈ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 31, 2025 నాటికి ఈ రంగం నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ. 74.44 లక్షల కోట్లకు చేరడం ఒక మైలురాయి.

ప్రజలలో పెరుగుతున్న ఆర్థిక అవగాహన ఫలితంగా, గృహాల ఆర్థిక ఆస్తులలో బీమా పెన్షన్ ఫండ్ల వాటా గణనీయంగా పెరిగింది. 2018-19లో ఇది 28.6శాతం ఉండగా, 2024-25 నాటికి 29.6శాతంకి చేరింది. ఇది కేవలం రక్షణ కోసమే కాకుండా, పొదుపు సాధనంగా కూడా బీమాను భారతీయులు విశ్వసిస్తున్నారని నిరూపిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ కల్పిస్తూనే, దేశాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను సమీకరించడంలో బీమా రంగం కీలకంగా మారింది. భారతదేశం వేగంగా ఆర్థిక రూపాంతరం చెందుతున్న ఈ తరుణంలో, బీమా రంగం యొక్క స్థిరమైన అభివృద్ధి దేశ భవిష్యత్తుకు, సామాజిక భద్రతకు ఒక బలమైన భరోసాను ఇస్తోంది. భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా విప్లవాత్మక బీమా పథకాలను అమలు చేస్తోంది.

జీవిత బీమా – ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన

ఇందులో భాగంగా జీవిత బీమా (పీఎంజేజేబీవై), ప్రమాద బీమా (పీఎంఎస్బీవై) కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2015 మేలో ప్రారంభమైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), 18-50 ఏళ్ల వయస్సు గల వారికి కేవలం రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకునే విధంగా ఉంటుంది. ప్రీమియం నేరుగా బ్యాంక్ ఖాతా నుండి ఆటో డెబిట్ అవుతుంది. కుటుంబ పెద్ద ఆకస్మిక మరణం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. ఫిబ్రవరి 2026 నాటికి 26.88 కోట్ల నమోదు, రూ.10,45,450 కుపైగా క్లెయిమ్ చెల్లింపులు జరగడం ద్వారా ఈ పథకం ప్రజాదరణను పొందింది. ఈ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇతర జీవిత బీమా సంస్థలు నిర్వహిస్తున్నాయి.

దీనిలో మొదటి 30 రోజుల్లో సహజ మరణం కవరేజీలో ఉండదు. ప్రమాద మరణం మాత్రం మొదటి రోజు నుంచే కవరేజీలో ఉంటుంది

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన

అదేవిధంగా, ప్రమాద బీమా కోసం రూపొందించిన ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) కూడా మే 2015లో ప్రారంభమైంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన, అసంఘటిత రంగ కార్మికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల బ్యాంక్ ఖాతాదారులు ఈ పథకంలో చేరవచ్చు. సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియంతో ప్రమాద మరణం లేదా పూర్తిస్థాయి వికలాంగతకు రూ.2 లక్షలు, భాగిక వికలాంగతకు రూ.1 లక్ష కవరేజీ అందిస్తుంది. ఫిబ్రవరి 2026 నాటికి 57.11 కోట్ల నమోదు, 1.76 లక్షల క్లెయిమ్ చెల్లింపులు జరగడం ద్వారా ఈ పథకం ప్రమాదాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తూ, ఆర్థికంగా బలహీన వర్గాలను రక్షిస్తుంది.

ఆరోగ్య భీమా- ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ (ఏబీ-పీఎంజేఏవై) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య పథకంగా నిలిచింది. 2018లో ప్రారంభమై ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తోంది. ఈ పథకం ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలను కవర్ చేస్తూ, ముందే ఉన్న వ్యాధులను కూడా మొదటి రోజు నుంచే చేర్చడం ప్రత్యేకత. వయస్సు, లింగం, కుటుంబ పరిమాణంపై ఎటువంటి పరిమితులు లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఆసుపత్రుల్లో సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. 2024లో 70 సంవత్సరాల పైబడిన వృద్ధులకు కూడా వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఫిబ్రవరి 28, 2026 నాటికి మొత్తం ఆయుష్మాన్ కార్డులు 43.52 కోట్లకు చేరాయి.

ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం

మరోవైపు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికుల కోసం ఈఎస్ఐ పథకం అనారోగ్యం, ప్రసూతి పనిలో జరిగే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తోంది. దాదాపు 15 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా వైద్య, ఆర్థిక సాయం పొందుతున్నారు. ఈ పథకం కింద నమోదైన ఫ్యాక్టరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, షాపులు, విద్య, వైద్య సంస్థల ఉద్యోగులు లాభపడతారు. 31 మార్చి, 2025 నాటికి ఉద్యోగులు - 3.24 కోట్లు, బీమా పొందిన వ్యక్తులు - 3.84 కోట్లు, మహిళలు - 83.1 లక్షలు, మొత్తం లబ్ధిదారులు - 14.91 కోట్లుగా ఉన్నారు.

పంట బీమా - ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన

రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) వ్యవసాయ రంగంలో అపారమైన భరోసాను నింపింది. రైతుల కోసం ఈ బీమా యోజన ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే, రైతులు అప్పుల పాలు కాకుండా ఈ పథకం ఆదుకుంటుంది. "ఒకే దేశం, ఒకే పంట, ఒకే ప్రీమియం" అనే సూత్రంతో ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీకి 1.5శాతం, వాణిజ్య/హార్టికల్చర్ పంటలు: 5శాతం వంటి అతి తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. రైతులు తక్కువ ప్రీమియంతో బీమా పొందగా, మిగతా ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది మార్చి 13, 2026 నాటికి దరఖాస్తులు - 93.98 కోట్లు కాగా, సుమారు రూ.1,94,505 కోట్ల క్లెయిమ్‌లను రైతులకు చెల్లించడం ద్వారా ఈ పథకం వ్యవసాయ స్థిరత్వానికి ఎంతగానో దోహదపడింది.

ఇది విత్తనాల విత్తడం నుండి పంట కోత తర్వాత నిల్వ వరకు మొత్తం వ్యవధిని కవర్ చేస్తుంది. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

ఈ పథకాలన్నీ కలిసి దేశంలో ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించాయి. జీవితం, ఆరోగ్యం, జీవనోపాధి వంటి మూడు ప్రధాన రంగాల్లో ఎదురయ్యే రిస్కులను ఇవి కవర్ చేస్తున్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రీమియంలు, పారదర్శకమైన క్లెయిమ్ ప్రక్రియ, డిజిటల్ చెల్లింపుల ద్వారా బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రభుత్వం కేవలం పథకాలను ప్రకటించడమే కాకుండా, వాటిని మారుమూల ప్రాంతాలకు చేరవేయడం ద్వారా ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించడమే కాకుండా, భవిష్యత్తులో భారత్‌ను ఆర్థికంగా మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు పునాది వేస్తోంది.