
ఎవరెస్ట్ మార్గంలో మంచు అడ్డంకి.. బేస్ క్యాంపులో నిలిచిపోయిన పర్వతారోహకులు
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించాలని వెళ్లిన వందలాది మంది పర్వతారోహకులకు ప్రకృతి అడ్డంకిగా మారింది. ఎవరెస్ట్ మార్గంలోని అత్యంత ప్రమాదకరమైన 'ఖుంబు ఐస్‌ఫాల్' ప్రాంతంలో భారీ మంచు గడ్డ (సెరాక్) మార్గాన్ని అడ్డుకోవడంతో యాత్రకు తాత్కాలిక విరామం పడింది. దీంతో బేస్ క్యాంపులో సుమారు 410 మందికి పైగా పర్వతారోహకులు మార్గం ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా ఎవరెస్ట్ అధిరోహణ ఏప్రిల్-మే నెలల్లో జరుగుతుంది. పర్వతారోహకులు వెళ్లడానికి ముందు 'ఐస్‌ఫాల్ డాక్టర్లు' అని పిలిచే అనుభవజ్ఞులైన షెర్పాలు మంచు గడ్డల మధ్య నిచ్చెనలు వేస్తూ, తాడులను కడుతూ మార్గాన్ని సుగమం చేస్తారు. అయితే ఈ ఏడాది క్యాంప్-2కు వెళ్లే దారిలో సుమారు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తున్న ఒక భారీ మంచు గడ్డ కూలిపోయే స్థితిలో వేలాడుతోంది. అది ఏ క్షణమైనా పడిపోయే అవకాశం ఉండటంతో మార్గాన్ని సిద్ధం చేసే పనులు నిలిచిపోయాయి.
సందిగ్ధంలో యాత్రికుల షెడ్యూల్
అమెరికాకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు గారెట్ మాడిసన్ దీనిపై స్పందిస్తూ.. "ప్రస్తుతానికి అక్కడ ప్రత్యామ్నాయ మార్గం ఏదీ కనిపించడం లేదు. ఆ భారీ మంచు శిల కూలిపోతే తప్ప మేము ముందుకు కదలలేము. దీనివల్ల అందరి షెడ్యూళ్లు మారిపోయాయి" అని తెలిపారు. 11 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన మింగ్మా షెర్పా కూడా పర్వతారోహకుల శిక్షణ, సామాగ్రిని పై క్యాంపులకు చేరవేసే ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేపాల్ ప్రభుత్వ ప్రయత్నాలు
నేపాల్ పర్యాటక శాఖాధికారి హిమల్ గౌతమ్ మాట్లాడుతూ.. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం నాటికే మార్గం సిద్ధమవుతుందని, కానీ ఈసారి ప్రకృతి సహకరించడం లేదని తెలిపారు. ఒకవేళ ఆ మంచు గడ్డ త్వరగా కరిగినా, పడిపోయినా పనులు వెంటనే మొదలవుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొంత మంది షెర్పాలను పంపి ప్రత్యామ్నాయ దారులు వెతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఆర్థికంగా కీలకమైన సీజన్
నేపాల్ ఆర్థిక వ్యవస్థలో పర్వతారోహణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఏడాది ఒక్కో పర్వతారోహకుడి నుంచి 15,000 డాలర్లు (సుమారు రూ.14 లక్షలు) వసూలు చేసి 410 పర్మిట్లను ప్రభుత్వం జారీ చేసింది. ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలలో 8 నేపాల్‌లోనే ఉండటంతో వేల సంఖ్యలో ప్రజలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత ప్రతిష్టంభన త్వరగా తొలగిపోవాలని అటు యాత్రికులు, ఇటు అధికారులు కోరుకుంటున్నారు.
