
2008 తర్వాత పుట్టిన వారికి యూకేలో ధూమపానం నిషేధం
బ్రిటన్ భవిష్యత్ తరాలను పొగాకు మహమ్మారి నుంచి రక్షించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పొగ తాగడాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా రూపొందించిన టొబాకో అండ్ వేప్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు బుధవారం తుది ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమల్లోకి వస్తే, ఒక నిర్దిష్ట సంవత్సరం తర్వాత జన్మించిన వారికి జీవితాంతం సిగరెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పొగాకు నియంత్రణ చట్టాలు ఉన్న దేశంగా బ్రిటన్ నిలవనుంది.
నియమం ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది?
ఈ నూతన బిల్లు ప్రకారం, డిసెంబర్ 31, 2008 తర్వాత జన్మించిన వారికి దేశంలో ఎక్కడా పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదు. అంటే, ఏటా సిగరెట్లు కొనే కనీస వయస్సును పెంచుకుంటూ పోవడం ద్వారా, భవిష్యత్ తరాలకు ధూమపానం అందకుండా చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఈ బిల్లు రాజు కింగ్ చార్లెస్ ఆమోదం (రాయల్ అసెంట్) కోసం వేచి ఉంది. వచ్చే వారమే ఇది చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.
కేవలం సిగరెట్లే కాదు.. వేపింగ్‌పై కూడా
బ్రిటన్ ప్రభుత్వం కేవలం సిగరెట్ల అమ్మకాలనే కాకుండా, ఆధునిక ధూమపాన పద్ధతి అయిన 'వేపింగ్' (ఈ-సిగరెట్లు)పై కూడా కఠినమైన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చిన్నపిల్లలను ఆకర్షించేలా రంగురంగుల ప్యాకింగ్‌లతో, రకరకాల ఫ్లేవర్లలో వస్తున్న వేపింగ్ ఉత్పత్తుల ప్రకటనలను, బ్రాండింగ్‌ను ప్రభుత్వం అడ్డుకోనుంది. పాఠశాలల సమీపంలో, ఆట స్థలాల్లో, పిల్లలు ప్రయాణించే కార్లలో, ఆసుపత్రుల పరిసరాల్లో వేపింగ్‌ను పూర్తిగా నిషేధించారు. అయితే ధూమపానం మానేయాలనుకునే వారికి సహాయపడటం కోసం ఆసుపత్రుల వెలుపల కొన్ని ప్రాంతాల్లో మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు తమ సొంత ఇళ్లలో, పబ్ గార్డెన్లు, బీచ్‌లలో ధూమపానం చేసే విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
ఈ వినూత్న ఆలోచన వాస్తవానికి 2023లోనే అప్పటి ప్రధాని రిషి సునక్ హయాంలో మొదలైంది. అయితే 2024 ఎన్నికల కారణంగా ఆ బిల్లు అప్పట్లో వాయిదా పడింది. ప్రస్తుత లేబర్ ప్రభుత్వం ఈ ప్రజా ఆరోగ్య ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదించింది. గతంలో న్యూజిలాండ్ కూడా ఇలాంటి చట్టాన్ని 2022లో తెచ్చినప్పటికీ, తర్వాతి కాలంలో అక్కడి ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కానీ బ్రిటన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం
"నివారణ అనేది చికిత్స కంటే ఉత్తమం. ఈ సంస్కరణ వేలాది మంది ప్రాణాలను కాపాడుతుంది, జాతీయ ఆరోగ్య సేవపై ఒత్తిడిని తగ్గిస్తుంది" అని బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ పేర్కొన్నారు. పొగాకు వల్ల కలిగే అనారోగ్యాలు, మరణాలను తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆస్తమా అండ్ లంగ్ యూకే వంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
వ్యతిరేక గళాలు
ఈ బిల్లుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నప్పటికీ, రాజకీయంగా కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. 'రిఫార్మ్ యూకే' పార్టీ నేత నైగెల్ ఫరాజ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని, తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ఆయన ప్రకటించడం గమనార్హం.
