Let's talk: editor@tmv.in
త్వరలో ఏఐ హబ్‌తో ఇంజనీర్లకు నైపుణ్య శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు

త్వరలో ఏఐ హబ్‌తో ఇంజనీర్లకు నైపుణ్య శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
5 మే, 2026

తెలంగాణలో ప్రతి ఏడాది చదువు పూర్తి చేసుకుంటున్న సుమారు 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామిక సంస్థలపైనే ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం బేగంపేటలోని వివాంతా హోటల్‌లో 'పిఎస్ ఆర్ టెక్ హబ్' సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

విద్యా సంస్థల్లో నేర్చుకునే చదువులకు, పరిశ్రమల్లో ఉండే సాంకేతిక అవసరాలకు మధ్య భారీ అంతరం ఏర్పడిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి సంస్థ తమ సామాజిక బాధ్యతగా గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, వారిని ఉద్యోగాలకు సంసిద్ధులను చేయాలని కోరారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతలు వస్తున్న తరుణంలో, ఇంజనీర్ల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం వచ్చే రెండు నెలల్లో ‘ఏఐ హబ్’ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

పదేళ్ల క్రితం ప్రారంభమై, అనేక సవాళ్లను అధిగమించి నేడు రూ.120 కోట్ల టర్నోవర్‌తో ఎదిగిన పీఎస్ఆర్ టెక్ హబ్ ప్రస్థానాన్ని మంత్రి కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిలదొక్కుకుని, 250 మంది ఉద్యోగులకు భరోసానివ్వడం అభినందనీయమన్నారు. సంస్థ అధినేత పి. శ్రీరంగారావు కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలు

సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఏఐ వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సంస్థ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

త్వరలో ఏఐ హబ్‌తో ఇంజనీర్లకు నైపుణ్య శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు - Tholi Paluku