Let's talk: editor@tmv.in
స‌ర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

స‌ర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
15 జూన్, 2026

కరీంనగర్ పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే సర్ ప్రక్రియపై బీఎల్ఏ-2లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. అదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌లో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే చిరునామా మార్పు, పేరు సవరణ, ఫోటో మార్పు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

బూత్ లెవెల్ ఏజెంట్లు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాలను ధృవీకరించాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసే ప్రతి డ్రాఫ్ట్ ఓటరు జాబితాను పరిశీలించి అవసరమైన అభ్యంతరాలు, సవరణలను సకాలంలో సమర్పించాలని సూచించారు.

గ్రామ, వార్డు, మండల స్థాయిల్లో పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఆ హక్కు అందేలా చూడడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి స‌ర్ ప్రక్రియను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని నాయకత్వం దిశానిర్దేశం చేసింది.