
సర్ అనేది కేవలం ఎన్నికల అంశం కాదు.. పౌరసత్వ సమస్య: ఎంపీ అసదుద్దీన్
సర్ జాబితాలో ప్రతి ఒక్క అర్హుడైన ఓటరు పేరు ఉండేలా ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఇది కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, దేశ పౌరసత్వ సమస్య అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రక్రియలో రాజకీయాలు, మతం లేదా వర్గాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకుండా, పౌరులందరికీ సహాయం అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
సోమవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ.. మన కఠిన రాజకీయ ప్రత్యర్థి పేరు కూడా ఈ జాబితాలో ఉండేలా చూడటమే మన ఉమ్మడి లక్ష్యం కావాలి. ఓటర్ల లిస్ట్‌లో పేరు లేకపోవడం వల్లే ఓడిపోయామని వారు తర్వాత ఏడవకూడదు. ముందు వారి పేర్లు నమోదయ్యేలా చూసి, ఆపై వారిని ఎన్నికల్లో ఓడించాలని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన పేద ప్రజలు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులను తన రాజకీయ శత్రువు కూడా ఎదుర్కోకూడదని ఆకాంక్షించారు.
గడిచిన 45 రోజులుగా వేలాది మంది సామాన్య ప్రజలు పార్టీ ప్రధాన కార్యాలయం ‘దారుస్సలాం’ను సందర్శిస్తున్నారని, అక్కడ 10-12 మంది యువతీ యువకులతో కూడిన బృందం ప్రజలకు నిరంతరం సహాయం అందిస్తోందని ఓవైసీ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి 'మజ్లిస్ హెల్ప్‌డెస్క్' కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జాబితా నుంచి మినహాయించబడిన 27 లక్షల మంది ప్రజల రేషన్ కార్డులు, పెన్షన్లను రద్దు చేయడం పూర్తిగా అన్యాయమన్నారు. ప్రభుత్వ నిధులు ప్రజల సొత్తు. సదరు వ్యక్తులు భారతీయ పౌరులు కారని ట్రైబ్యునల్ తేల్చే వరకు ప్రభుత్వ పథకాలను ఎలా నిలిపివేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క నిజమైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందని ఓవైసీ ముగించారు.
