Let's talk: editor@tmv.in
ఎస్‌ఐఆర్ రాజ్యాంగబద్ధ ప్రక్రియ.. అపోహలు సృష్టించొద్దు: బీజేపీ నేత ఎన్వీ సుభాష్

ఎస్‌ఐఆర్ రాజ్యాంగబద్ధ ప్రక్రియ.. అపోహలు సృష్టించొద్దు: బీజేపీ నేత ఎన్వీ సుభాష్

Gaddamidi Naveen
28 జూన్, 2026

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తీవ్రంగా తప్పుబట్టారు. స‌ర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా కొనసాగుతోందని, అలాంటప్పుడు ఓవైసీ ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి లేదా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘంతో ఎలాంటి సంబంధం లేదని, ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని స్పష్టం చేశారు.

ఓవైసీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సుభాష్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరును కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. స‌ర్ ప్రక్రియ ద్వారా బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందనే తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని, ప్రజలు అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో 24 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపట్టారని సుభాష్ గుర్తుచేశారు. దేశంలోని ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం సాధారణ విషయమేనని, అటువంటి మార్పులను ప్రతిబింబించేలా ఓటరు జాబితాలను నవీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత అని అన్నారు. ఎవరిపేరునైనా అన్యాయంగా ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఫేక్ ఓటర్ ఐడీలపై ఆందోళన – ప్రకాష్ రాజ్ ప్రస్తావన

ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్‌పై ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నాయో సుభాష్ వివరిస్తూ.. గతంలో పలుచోట్ల పెద్ద ఎత్తున దొంగ ఓట్లు, నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించబడ్డాయని, ఈ సవరణతో అవి ఎక్కడ బయటపడతాయోనని వారు భయపడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్‌పై వస్తున్న వార్తలను ఆయన ఉదహరించారు. ప్రకాష్ రాజ్‌కు నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నట్లు వార్తలు వచ్చాయని, ఆయనపై కేసు నమోదు కావడమే కాకుండా కోర్టు ఇప్పటికే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. బాధ్యతాయుతమైన పార్టీలుగా ఓటర్ల జాబితాలోని ఇటువంటి అక్రమాలను తొలగించడానికి సహకరించాల్సింది పోయి, గొడవ చేయడం సరికాదన్నారు. కేరళ, తమిళనాడు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇటువంటి అవకతవకలను అరికట్టడం వల్లే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు.

ఓవైసీ అభ్యంతరాలు

ఇంతకుముందు గురువారం విలేకరుల సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న స‌ర్ ప్రక్రియలో ఓటర్ల గుర్తింపు ధృవీకరణ కోసం ఈసీ పెట్టిన నిబంధనలు అత్యంత కఠినంగా, పేదలను మినహాయించేలా ఉన్నాయని విమర్శించారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు లేని పౌరులు గుర్తింపు కోసం ఈసీ సూచించిన 12 రకాల పత్రాలలో ఏదో ఒకటి సమర్పించడం అసాధ్యమన్నారు. అందులోని నాలుగు పత్రాలు అసలు ఉనికిలోనే లేవని లేదా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు సంబంధం లేనివని ఆయన వాదించారు. బూత్ స్థాయి అధికారులు ప్రస్తుతం ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తుండగా, జూలై 31న ముసాయిదా జాబితా, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానుంది.

ట్యాగ్‌లు
TelanganaSIRVoterListElectionCommissionECIAsaduddinOwaisiNVSubhashBJPAIMIMTelanganaPoliticsVoterVerificationElectoralRollHyderabad
ఎస్‌ఐఆర్ రాజ్యాంగబద్ధ ప్రక్రియ.. అపోహలు సృష్టించొద్దు: బీజేపీ నేత ఎన్వీ సుభాష్ - Tholi Paluku