
హైకోర్టులో ‘సర్’ హెల్ప్ డెస్క్ ప్రారంభం
ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, ఓటరు జాబితాలో పారదర్శకతను పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న చర్యలు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారి (డీఆఓ) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచనల మేరకు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం కింద వివిధ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో 2002–2025 ఓటర్ల మ్యాపింగ్ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను అదనపు కమిషనర్ (ఎలక్షన్స్) కె. చంద్రకళ, చార్మినార్ ఈఆర్ఓ సరిత కలిసి ప్రారంభించారు. ఈ డెస్క్ ద్వారా న్యాయవాదులు తమ ఓటు వివరాలను సులభంగా మ్యాపింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.
కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఈ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాలు, ఉద్యోగి సంఘాలు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెంటర్లు తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు కోరారు. ఓటరు జాబితాలో నకిలీ ఓట్లను తొలగించి, జాబితాను శుద్ధి చేయడమే ఈ సర్ ముఖ్య ఉద్దేశం.
