Let's talk: editor@tmv.in
త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు పునఃప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు పునఃప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
13 జూన్, 2026

సింగరేణిలో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత త్వరలో పునఃప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మెడికల్ బోర్డును పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశం ప్రస్తావనకు వచ్చిందని, కార్మికుల ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి చర్యలు చేపడుతోందని తెలిపారు. నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా వ్యవస్థను రూపొందించి, వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యానికి ఆయ‌న ఆదేశించారు.

ఇటీవల కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు ఈ నెల 13న మంచిర్యాలలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు భట్టి వెల్లడించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఆయ‌న‌ చెప్పారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో 2,657 పోస్టులు భర్తీ చేసినట్లు భట్టి వెల్లడించారు. ఇందులో 555 ప్రత్యక్ష నియామకాలు, 2,102 కారుణ్య నియామకాలు ఉన్నాయని చెప్పారు. కారుణ్య నియామకాల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడంతో 200 మందికి పైగా లబ్ధి చేకూరిందన్నారు.

అలాగే 40 వేల మంది ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఉచిత సహజ మరణ బీమా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రమాద బీమా, లాభాల బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి ఆసుపత్రుల ఆధునికీకరణతో పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కొత్త బొగ్గు బ్లాకులు సాధించి, ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణి విస్తరణకు కృషి చేస్తామని, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.