
సింగరేణి జీఎం ఆఫీస్ దహనం వ్యాఖ్యల కలకలం.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
సింగరేణి కార్మిక సంఘ రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి, హింసకు ప్రేరేపించేలా మాట్లాడారనే ఆరోపణలపై పోలీసులు శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది.
వివాదానికి దారి తీసిన వ్యాఖ్యలు
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం 'తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం' (టీబీజీకేఎస్) బలోపేతం కోసం నిర్వహించిన అంతర్గత సమావేశంలో బాల్క సుమన్ ప్రసంగించారు. సంఘానికి పూర్వ వైభవం రావాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవని మరింత దూకుడైన పోరాటాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో మందమర్రి ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించి అవసరమైతే సింగరేణి జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయాన్ని దహనం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం జైలుకు వెళ్లడానికైనా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు.
బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల వీడియోలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసను ప్రేరేపించడం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం అరాచకత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రాష్ట్ర డీజీపితో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో అరెస్ట్
కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి (తెలంగాణ భవన్) చేరుకున్న పోలీసులు సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాజకీయ కక్షసాధింపు చర్యే
పోలీసులు తనను తీసుకెళ్లే ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తాను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. అయితే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను పోలీసుల విచారణకు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. వివాదం ముదరడంతో బాల్క అయితే సుమన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను "మిలిటెంట్ చర్యలు" అనే పదాన్ని కేవలం కార్మికుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాడానని అంతకు మించి హింసను ప్రేరేపించే ఉద్దేశం తనకు లేదన్నారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ సమస్యలు, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలనేదే తన ఆవేదన అని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
