Let's talk: editor@tmv.in
వైఎస్ జగన్‌తో సింగపూర్ కాన్సుల్ జనరల్ భేటీ

వైఎస్ జగన్‌తో సింగపూర్ కాన్సుల్ జనరల్ భేటీ

Gaddamidi Naveen
1 జులై, 2026

చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ ట్జే చియాంగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

దీనికి ముందు, సోమవారం ఎడ్గార్ పాంగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ భేటీ అయ్యారు. ఈ నెల ప్రారంభంలో సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటించిన విషయాన్ని, అలాగే ఏపీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఈ సందర్భంగా చర్చించినట్లు భారతదేశంలోని సింగపూర్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొంది. సింగపూర్ - ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు పాంగ్ తెలిపారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా 5 మెట్రిక్ టన్నుల ప్రీమియం ‘బంగినపల్లి మామిడి’ పండ్ల రవాణా సింగపూర్‌కు విజయవంతంగా చేరుకోవడంపై భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ వీ క్వెన్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా, ఐసీఏఆర్-సీఐఎస్హెచ్ ల సహకారంతో ఈ వాణిజ్య సముద్ర రవాణా సాధ్యమైంది.

'ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ' ద్వారా జూన్ 11, 2026న బయలుదేరిన ఈ రవాణా.. జూన్ 24న సింగపూర్ చేరుకుంది. ఏపీలోని గ్లోబల్ గ్యాప్ ధృవీకృత తోటల నుంచి సేకరించిన ఈ పండ్లను కర్ణాటకలోని అపెడా ప్యాక్‌హౌస్‌లో సింగపూర్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెస్ చేశారు. సింగపూర్ దిగుమతిదారు 'ఈసీ-లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్' ఈ పండ్ల అద్భుతమైన నాణ్యత, తీపిదనం, ఎక్కువ రోజులు నిల్వ ఉండే రకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. బంగినపల్లి మామిడి దాని సువర్ణ పసుపు రంగు, పీచు లేని గుజ్జు, అద్భుతమైన తీపిదనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను కలిగి ఉంది. ఈ మైలురాయి ఎగుమతి ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన హార్టికల్చర్ ఎగుమతులకు సరికొత్త మార్గం సుగమమైంది.

ట్యాగ్‌లు
YSJaganJaganMohanReddyYSRCPSingaporeEdgarPangAndhraPradeshAPNewsTadepalliDiplomacyIndiaSingaporeInternationalRelationsAPPolitics